షెడ్యూల్‌‌ ప్రాంతాల్లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

షెడ్యూల్‌‌ ప్రాంతాల్లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జడ్పీటీసీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఏజెన్సీ ఏరియాల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్‌‌ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సామాజిక కార్యకర్త జి. రాముతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌‌ టి. మాధవీదేవి విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది రిజర్వేషన్‌‌ల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవడంలేదని, దీనిపై వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. దీంతో పంచాయతీరాజ్‌‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, ఎన్నికల సంఘాలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 27కు వాయిదా వేశారు