విధుల డుమ్మాకు ఎలక్షన్స్‌‌ లైసెన్సా?

విధుల డుమ్మాకు ఎలక్షన్స్‌‌ లైసెన్సా?
  • హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌ తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఓ సివిల్‌‌ కేసులో సింగిల్‌‌ జడ్జి తీర్పుపై అప్పీలు దాఖలు చేయడంలో జాప్యం జరగడానికి ఎన్నికలే కారణమని చెప్పడాన్ని తప్పుపట్టింది. పని ఎగవేతకు ఎన్నికలను సాకుగా చెప్పడం ఏమిటని నిలదీసింది. విధుల డుమ్మాకు ఎలక్షన్స్‌‌ ఏమైనా లైసెన్సా అని ప్రశ్నించింది.  హైదరాబాద్‌‌ గుడిమల్కాపూర్‌‌లో 2302 చదరపు గజాల స్థలానికి సంబంధించి మహమ్మద్‌‌ ఫజలుల్లాల్‌‌ హక్‌‌ మరో 9 మంది 2016లో హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై విచారించిన సింగిల్‌‌ జడ్జి ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదని తీర్పు వెలువరించారు. భూసేకరణ చట్టం కింద 6 నెలల్లో తగిన చర్యలు చేపట్టాలని..లేకుంటే స్థలాన్ని స్వాధీనం చేయాలని 2016 సెప్టెంబరు 13న అధికారులను ఆదేశించింది. సింగిల్‌‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌.. ఈ ఏడాది జులైలో అప్పీలు దాఖలు చేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావుల ధర్మాసనం శుక్రవారం విచారించింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది దివ్య వాదిస్తూ..ఎన్నికల వల్ల అప్పీలు దాఖలు చేయటంలో ఆలస్యంమైందని, మన్నించి అప్పీలుపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ వాదనపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పీలు దాఖలు చేసిన హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌ ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేశారు? గెలుపొందారా? అంటూ ఫైర్ అయ్యింది. 

ఎన్నికల ప్రచారానికి వెళ్లడం వల్ల అప్పీలు దాఖలు చేయడంలో జాప్యం జరిగిందా అంటూ నిలదీసింది. 2023లో ఎన్నికల నోటిఫికేషన్‌‌ వచ్చినందున అప్పీలు దాఖలు చేయలేకపోయామని ఎలా చెబుతారని ప్రశ్నించింది. న్యాయవాది సమాధానమిస్తూ సరైన కారణాలతో అఫిడవిట్‌‌ దాఖలు చేస్తామనగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.