ఇద్దరు ఐఏఎస్ లకు హైకోర్టు జరిమానా

ఇద్దరు ఐఏఎస్ లకు హైకోర్టు జరిమానా

హైదరాబాద్, వెలుగు: కోర్టుధిక్కరణ  కేసులో ఐఏఎస్‌ ఆఫీసర్లు నవీన్‌ మిట్టల్, వాకాటి కరుణలతో పాటు కాలేజీ ఎడ్యుకేషన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.యాదగిరి, కుల్వకుర్తి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.స్వర్ణలతకు రూ. 10 వేల చొప్పున ఫైన్​ వేస్తూ హైకోర్టు జస్టిస్‌ పి.మాధవీదేవి తీర్పు చెప్పారు. ఫైన్​ కట్టకపోతే నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌  కె.శ్రీనివాసరావును తొలగిస్తూ 2022 ఆగస్టు 5న విద్యా శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆ అధికారం కమిషనర్‌కు లేదని, జాయింట్‌ డైరెక్టర్‌కే ఉందని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. తీర్పు వచ్చిన తర్వాత కూడా శ్రీనివాస్‌రావును సర్వీస్‌లోకి తీసుకోకుండా జేడీ తొలగింపు ఉత్తర్వులిచ్చారు. దీనిపై శ్రీనివాస్‌ రావు కోర్టు ధిక్కరణ కేసు  వేశారు. దీంతో గతేడాది ఆగస్టు 5 నుంచి అక్టోబరు 29 వరకు విధుల్లోకి తీసుకుంటున్నట్లు జేడీ ఆదేశాలిచ్చారు. కోర్టు ధిక్కరణ నోటీసు అందుకున్నాకే జీతం చెల్లించారని హైకోర్టు గుర్తించింది. పిటిషన్‌ దాఖలు చేశాకే నియామక ఉత్తర్వులిచ్చారని, దీన్ని బట్టి కోర్టు ధిక్కరణ కేసును తప్పించుకునే ప్రయత్నం చేశారని అధికారుల తీరును తప్పుపట్టింది. కావాలనే ఉత్తర్వుల్ని అమలు చేయలేదంటూ రూ.10 వేల ఫైన్​ విధిస్తూ తీర్పు చెప్పింది.