ప్రైవేట్​లో ట్రీట్​మెంట్​ రేట్లు ఎందుకు ఫిక్స్​ చేయలే

ప్రైవేట్​లో ట్రీట్​మెంట్​ రేట్లు ఎందుకు ఫిక్స్​ చేయలే

ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా
రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఫైర్
కరోనా ట్రీట్​మెంట్​ పర్మిషన్​ రద్దు చేసి 
చేతులు దులుపుకుంటరా
మెడమీద కత్తి పెట్టి అయినా 
దోచుకున్న డబ్బు కక్కించాలె
థర్డ్​ వేవ్‌ కట్టడి ప్లాన్‌పై 
అఫిడవిట్‌ ఇవ్వాలని ఆదేశం
విచారణకు హెల్త్​ సెక్రటరీ రావాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్‌‌ ఆస్పత్రుల మెడపై కత్తి పెట్టి కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు అడ్డగోలుగా వసూలు చేసిన పైసలు కక్కించాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆస్పత్రుల పర్మిషన్​లను రద్దు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఎలాగని నిలదీసింది. ‘తల తెగ్గొడితే ఎలా? మెడపై కత్తి పెట్టి వసూలు చేసిన అధిక ఫీజులను రాబట్టాల్సిందే’నని తేల్చి చెప్పింది. ప్రైవేట్, కార్పొరేట్‌‌ ఆస్పత్రుల్లో దోపిడీని ఆరికట్టేందుకు గరిష్ట ధరలను నిర్ణయిస్తూ జీవో ఎందుకు జారీ చేయలేదని, కారణం చెప్పాలని ప్రశ్నించింది. గతేడాది కరోనా లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో దాఖలైన వేర్వేరు పిల్స్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి. విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం దాదాపు 2 గంటల పాటు విచారించింది. అధిక ఫీజులను వెనక్కి ఇప్పించడంపై పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్‌‌ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతేడాది కరోనా వేళ కార్పొరేట్‌‌ ఆస్పత్రుల నుంచి బాధితులకు రూ. 3 కోట్లు వెనక్కి ఇప్పించామన్నారు. దీనిపై సంతృప్తి చెందని కోర్టు.. గతంలోని ఘనతలు ఎన్నాళ్లు చెప్పుకుంటారని, ఇప్పుడూ అదే పని చేసి బాధితులకు డబ్బులు ఇప్పించాలని చెప్పింది.

రాష్ట్రంలో 174 కార్పొరేట్, ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌పై ఫిర్యాదు వచ్చాయని.. 115 ఆస్పత్రులకు షోకాజ్‌‌‌‌ నోటీసులు ఇచ్చామని, 21 ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ రద్దు చేశామని హెల్త్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. కరోనా టైమ్‌‌‌‌లో లైసెన్స్‌‌‌‌లు రద్దు చేస్తే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఇబ్బంది పడాల్సి వస్తుందని, వసూలు చేసిన ఎక్కువ ఫీజులను రాబాడితే రోగులకు ఆర్థికంగా మంచి జరుగుతుందని చెప్పింది. ప్రైవేట్, కార్పొరేట్‌‌‌‌ ఆస్పత్రుల్లో ఫీజులపై యేటా చివర్లో జీవోల సవరణ ఉంటుందని శ్రీనివాస్‌‌‌‌రావు జవాబు చెప్పగా కోర్టు మండిపడింది. అప్పుడు సీటీ స్కాన్, ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్టులు, బ్లడ్‌‌‌‌ టెస్టులు, పీపీఈ కిట్లు వంటి వాటితో సంబంధం లేదని.. ఇప్పుడు వాటి పేరుతో ఇష్టానుసారం బిల్లులు వసూలు చేయకుండా కాలం చెల్లిన ఆ జీవోలను మార్చాల్సిందేనని తేల్చి చెప్పింది. ఏపీలో మాదిరి హాస్పిటళ్లలో నోడల్‌‌‌‌ ఆఫీసర్లను నియమిస్తే రోగుల బిల్లులను పరిశీలించి ఖరారు చేస్తారని, దీని వల్ల అధిక బిల్లుల దోపిడీని అరికట్టవచ్చని కోర్టు సూచించింది. ఏపీలో ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రులు తక్కువని, తెలంగాణలో ఎక్కువగా ఉన్నందున నోడల్‌‌‌‌ అధికారుల పర్యవేక్షణ కుదరదని శ్రీనివాసరావు చెప్పారు. 
రెడీ అయిన టెస్టు సెంటర్లను 
ప్రారంభోత్సవాల కోసం ఆపారా?
14 ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్టు సెంటర్లను ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. శ్రీనివాసరావు స్పందిస్తూ.. జూన్‌‌‌‌ 10 నాటికి 14 సెంటర్లు ఏర్పాటు అవుతాయని చెప్పారు. ఇప్పటికే 6 రెడీగా ఉన్నాయని ఆయన చెప్పగానే ప్రారంభోత్సవాల కోసం ఆపారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడున్న సమస్యకు ఇప్పుడే చర్యలు తీసుకోవాలని, ఎప్పుడో చర్యలు తీసుకుంటామంటే కరోనా చూస్తూ కూర్చోదని హెచ్చరించింది. స్టాఫ్‌‌‌‌ భర్తీ, మౌలిక వసతు ల కల్పన, ఎమర్జెన్సీ మందుల గురించి ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేదని తప్పుబట్టింది. మూడో దశ కరోనా నివారణకు ముందస్తు ప్రణాళికల గురించీ చెప్పలేదంది. థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌లో పిల్లలపై కోరలు చాస్తుందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ హెచ్చరిస్తున్నారని, దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలాంటి ప్లాన్‌‌‌‌ రెడీ చేస్తోందని ప్రశ్నించింది. దీనిపై అఫిడవిట్లు దాఖలు చేయాలంది. ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు, స్టాఫ్‌‌‌‌ కొరత ఎలా నివారణ, మెడిసిన్స్‌‌‌‌ ఎట్లా సమకూర్చుకుంటున్నారు, పేదలను ఎలా ఆదుకుంటున్నారు లాంటి అంశాలపై వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలంది. ప్రభుత్వాధికారులు ఇచ్చిన నివేదికలు అన్నీ అరకొర సమాచారంతో ఉన్నాయంది. 
డెలివరీ బాయ్స్‌‌‌‌ బాధ్యత కంపెనీలదే
రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వాళ్లు 92.58 లక్షల మంది ఉంటే వారిలో తొలి విడత 35.5 లక్షల మందికి, రెండో విడత 12.68 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశామని కోర్టుకు శ్రీనివాసరావు చెప్పారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వాళ్లు 1.84 కోట్ల మంది ఉన్నారని, రెండు వారాల్లో 7 లక్షల మందికి వేశామని వివరించారు. వీళ్లంతా డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్స్, డైలీ వర్కర్స్, వెజిటబుల్‌‌‌‌, వీధి వ్యాపారులన్నారు. 20 కంపెనీల్లో 1.4 లక్షల మంది డెలివరీ బాయ్స్‌‌‌‌ ఉన్నట్లు గుర్తించామని, వాళ్ల బాధ్యత కంపెనీలదేనని ప్రభుత్వం చెప్పిందన్నారు. వ్యాక్సిన్లకు సంబంధించి ఈ నెల 4న టెండర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేస్తామని చెప్పారు. కాగా, గ్రామాల్లో వ్యాక్సినేషన్‌‌‌‌ వేయలేదని కోర్టుకు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. 40 మందితో జరగాల్సిన పెండ్లి వందల మందితో చేస్తున్నారని మరో న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. వైద్య శాఖ కార్యదర్శి అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేసి తర్వాతి విచారణకు హాజరు కావాలంది.
బ్లాక్‌‌‌‌ ఫంగస్‌‌‌‌ కేసులపై కోర్టు ఆరా
బ్లాక్‌‌‌‌ ఫంగస్‌‌‌‌ కేసుల గురించి కోర్టు ఆరా తీసింది. రాష్ట్రంలో 800 బ్లాక్‌‌‌‌ ఫంగస్‌‌‌‌ కేసులు ఉన్నాయని, దేశంలోనే తొలిసారిగా కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్‌‌‌‌గా ప్రకటించామని శ్రీనివాసరావు చెప్పారు. వీటిలో 85 శాతం కేసులు జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వ, కార్పొరేట్‌‌‌‌ ఆస్పత్రుల్లో సొంత ఆక్సిజన్‌‌‌‌ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. కార్పొరేట్‌‌‌‌ ఆస్పతులు నెల నుంచి 45 రోజుల్లో ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్‌‌‌‌ ఫంగస్‌‌‌‌ నివారణ మందులను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా సమకూర్చుకుందని, బ్లాక్‌‌‌‌లో అమ్మకాలకు ఆస్కారం లేకుండా తన ఆఫీసుకు ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రులు వచ్చి సంతకం చేసి మందులు తీసుకువెళ్లేలా ఏర్పాటు చేశామని చెప్పారు. పిల్లలపై థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌ ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో నీలోఫర్‌‌‌‌తో పాటు అన్ని సర్కారు ఆస్పత్రుల్లోని రెగ్యులర్‌‌‌‌ బెడ్లను ఆక్సిజన్‌‌‌‌ బెడ్లుగా మార్చాలని సీఎం ఆదేశించారని వివరించారు.