మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వేళ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ విచారణకు ఎస్ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నా కూడా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడం అత్యంత బాధాకరం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పనితీరు సరిగాలేదని హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టింది.  ఉద్యోగులు డ్యూటీ చేస్తారా లేక చస్తారా అనే పరిస్థితి కల్పించారని హైకోర్టు మండిపడింది. కరోనా విపత్తు సమయంలో ఎన్నికలేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఎస్ఈసీ దృష్టి మాత్రం ఎన్నికలపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు కరోనా టైంలో ఎన్నికలు అవసరమా అని ప్రశ్నించింది. ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహం మీద ఉన్నారేమో? అని వ్యాఖ్యానించింది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం కూడా ఎన్నికలకు ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని కోర్టు తెలిపింది. గతంలో జీహెచ్ఎంసీ మేయర్ స్థానం ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎన్నికలు గుర్తురాలేదా? అని ప్రశ్నించింది. 

మున్సిపల్ ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించాలని కోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. ఎన్నికల వేళ ప్రజలు గుమ్మిగూడకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో 2557 మంది పోలీసులు, 7695 మంది ఉద్యోగులు పాల్గొంటారని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది.