ఆర్టీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు 3 నెలల్లోగా  నిర్వహించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్వర్వులు జారీ చేసింది. రెండేండ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని సోమవారం విచారించిన జస్టిస్‌ సూరేపల్లి నంద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతోపాటు పలువురిని ప్రతివాదులుగా చేర్చాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు పిటిషనర్‌ యూనియన్‌ నేత కె.రాజిరెడ్డి వాళ్లను ప్రతివాదులుగా చేర్చారు. 2016లో ఎన్నికలు జరిగాయని, 2018లో సంఘం కాల పరిమితి ముగిసిందని పిటిషనర్‌ తరఫు లాయర్  ఏకే జయప్రకాశ్‌రావు వాదించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని పలుమార్లు కార్మిక శాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు నిర్వహించకపోవడం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.

ఎన్నికల కోసం ఐదేండ్లుగా పోరాడుతున్నం

హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్టీసీలో 2018లో గుర్తింపు సంఘం టర్మ్ అయిపోయిందని, ఐదేండ్లుగా మేనేజ్​మెంట్​ను, లేబర్ డిపార్ట్​మెంట్​ను ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నామని ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి తెలిపారు. వారు స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వెల్లడించారు. హైకోర్టు తీర్పుతోనైనా ఎన్నికలు నిర్వహించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు శుభ పరిణామమని టీఎంయూ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి అన్నారు. ఎన్నికలు నిర్వహించాలని లేబర్ డిపార్ట్ మెంట్ ను చాలా సార్లు కోరినట్లు తెలిపారు. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహిస్తే పాల్గొనేందుకు గుర్తింపు సంఘంగా తాము రెడీగా ఉన్నామని వెల్లడించా రు. పీఆర్సీ ఇస్తామని మునుగోడు బైపోల్ టైమ్ లో ఆర్టీసీ కార్మికులకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేద న వ్యక్తం చేశారు. ఎలక్షన్ అయిపోయినా ఇంత వరకు పీఆర్సీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లకు అనుమతించకుండా రాచరిక పాలన కొనసాగిస్తున్నదని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులను కన్సలెంట్లుగా నియమిస్తూ ఆర్టీసీ ఉద్యోగులను 3 ఏండ్లుగా  వేధిస్తున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో అనేకసార్లు ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. 

అప్పీల్​కు వెళ్లనున్న ప్రభుత్వం!

ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా స్టే ఆర్డర్ తెచ్చుకుంది. 2019 లో ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేసి, వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశామని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నామని అప్పీట్​లో చెప్పే అవకాశమున్నట్లు సమాచారం. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులకు ఆటంకం కలగడంతో పాటు, ప్రచారం పేరుతో విధులకు డుమ్మా కొడతారని చెప్పనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేదా ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని, లేదా ఎన్నికల నిర్వహణకు కొంత టైమ్ ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది.