మావోయిస్ట్‌‌ నేత విక్రమ్‌‌కు బెయిల్

మావోయిస్ట్‌‌ నేత విక్రమ్‌‌కు బెయిల్

హైదరాబాద్, వెలుగు: హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి 11 ఏండ్లుగా జైల్లో ఉన్న మావోయిస్ట్‌‌ నేత దారగోని శ్రీను విక్రంకు హైకోర్టు బెయిల్‌‌ మంజూరు చేసింది. మహబూబ్‌‌ నగర్‌‌ జిల్లా ఆమనగల్‌‌ కాంగ్రెస్‌‌ నేత, ఎంపీపీ హత్య కేసులో కింది కోర్టు విక్రమ్​ను ముద్దాయిగా తేల్చింది. ఈ తీర్పును 2015లో విక్రమ్ హైకోర్టులో సవాల్‌‌ చేశారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్‌‌ ఇవ్వాలని మధ్యంతర పిటిషన్‌‌ వేశారు.

దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌‌ కె.సుజనతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల విచారణ జరిపింది. పిటిషనర్‌‌పై ఉన్న మొత్తం 17 కేసుల్లో ఈ ఒక్క కేసు మాత్రమే పెండింగ్​లో ఉందని, ఇతర కేసుల్లో కోర్టులు ఆయనను నిర్దోషిగా తేల్చాయని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. విక్రమ్ 11 ఏండ్లుగా జైలులో ఉన్నారని, బెయిల్‌‌ ఇవ్వాలని కోరాగా, హైకోర్టు బెయిల్‌‌ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తు సమర్పించాలని, ప్రతి నెల తొలి ఆదివారం ఆమనగల్‌‌ పీఎస్‌‌లో హాజరు కావాలని పిటిషనర్‌‌ను ఆదేశించింది.