ఇది భూ కబ్జానే..ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరం ఏముంది

ఇది భూ కబ్జానే..ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరం ఏముంది
  • కమ్మ, వెలమ సంఘాల భవనాలకు భూ కేటాయింపులపై హైకోర్టు ఫైర్​
  • 5 ఎకరాల చొప్పున ఇస్తూ సర్కారు జారీ చేసిన జీవోపై స్టే
  • ప్రభుత్వ భూముల్ని పాలకులు ఇష్టారీతిన పంచేయడానికి వీల్లేదు
  • అణగారిన వర్గాలకు, దళిత స్టూడెంట్స్‌‌ హాస్టల్స్‌‌కు భూమి ఇస్తే అర్థం చేసుకోవచ్చు
  • అగ్ర కులాలకు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
  • కులాల వారీగా భూములు పంచడం హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం
  • ఇలానే హెటిరో ఫార్మా సింధు ఫౌండేషన్‌‌కు భూములు లీజుకిస్తే రద్దు చేసినం
  • కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం.. ఆగస్టు 4కి విచారణ వాయిదా

హైదరాబాద్, వెలుగు:  కుల సంఘాల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని ఉచితంగా ఇవ్వడం ఒక విధంగా భూకబ్జానే అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా వ్యవహరించాల్సిందిపోయి.. ఇష్టానుసారంగా భూములు పంచుకుంటూ పోవడం దారుణమని మండిపడింది. ‘నువ్వు ఇది తీసుకో.. నువ్వు అది తీసుకో..’ అంటూ తన జేబులోంచి తీసి ఇచ్చినట్లుగా పంచుకుంటూ పోతే ఎలాగని ప్రశ్నించింది. కులాల వారీగా భూములు పంచడం హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టం చేసింది. హైదరాబాద్‌‌లో కమ్మ, వెలమ కుల సంఘాల భవనాలకు ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌‌లో ఆలిండియా వెలమ సంఘం, కమ్మ వారి సేవా సంఘాల భవనాల కోసం 5 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమిని ఇస్తూ 2021 జూన్‌‌ 30న ఇచ్చిన జీవో 47 అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా.. కమ్మ, వెలమ కుల సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన భూమికి ప్రహరీ నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ సంఘాల తరఫు లాయర్లు కోరడంపై హైకోర్టు మండిపడింది. భూములు కబ్జా అవుతాయని లాయర్లు చెప్పగా.. కుల సంఘాలకు ప్రభుత్వ భూమి కేటాయింపు కూడా ఒక విధంగా భూకబ్జా వంటిదేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. కమ్మ, వెలమ కుల సంక్షేమ భవనాల కోసం భూమి కేటాయించడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ రిటైర్డ్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ ఎ.వినాయక్‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌‌‌‌పై విచారణ జరిపింది.

కులాలను ప్రభుత్వమే పెంచిపోషిస్తున్నది

‘‘ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందుకోని అణగారిన వర్గాలకు, దళిత స్టూటెంట్స్‌‌‌‌ హాస్టల్స్‌‌‌‌కు భూమి ఇస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆర్థికంగా బలంగా ఉన్న  కమ్మ, వెలమ వంటి అగ్ర కులాలకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వమే కులాలను పెంచి పోషించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. హైటెక్‌‌‌‌ తెలంగాణ స్టేట్‌‌‌‌కు ఇదేం పద్ధతి? కుల సంఘాల పేరిట రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అత్యంత విలువైన భూములను కేటాయించడం దారుణం” అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైటెక్‌‌‌‌ సిటీకి సమీపంలో కోట్ల రూపాయల విలువైన భూమిని అగ్ర కులాలకు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ భూముల్ని పాలకులు ఇష్టానుసారంగా పంచేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కమ్మ, వెలమ సంఘాలకు భూములు ఇవ్వడం గత హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ‘‘ట్రస్టీగా ఉండాల్సిన సర్కార్‌‌‌‌.. భూములను ధారాదత్తం చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఏం కావాలి. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌‌‌‌కు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అగ్ర కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఏమిటి?” అని ప్రశ్నించింది.

‘హెటిరో’కు ల్యాండ్‌‌‌‌ లీజుల్ని రద్దు చేశాం

ఇటీవలే హెటిరో అధినేత (టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రాజ్యసభ మెంబర్‌‌‌‌ పార్థసారథిరెడ్డి)కు చెందిన హాస్పిటల్‌‌‌‌కు భూమి కేటాయింపు కూడా అలాంటిదేనని హైకోర్టు గుర్తు చేసింది. హెటిరో సంస్థకు చెందిన సాయి సింధు ఫౌండేషన్‌‌‌‌కు భూమిని అతితక్కువ ధరకే రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సింధు ఫౌండేషన్‌‌‌‌కు 1989 నాటి నామమాత్రపు ధరలతో భూముల లీజులను కేటాయించడాన్ని రద్దు చేస్తూ తీర్పు చెప్పినట్లు స్పష్టం చేసింది.

కాలయాపనకు ఎత్తుగడలు వేస్తున్నరు

తాము కౌంటర్‌‌‌‌ దాఖలు చేశామని విచారణ సందర్భంగా కోర్టుకు వెలమ సంఘం తరఫున సీనియర్‌‌‌‌ లాయర్‌‌‌‌ రవికిరణ్‌‌‌‌రావు తెలియజేశారు. అయితే కమ్మ సేవా సంఘాల సమాఖ్య తరఫు లాయర్‌‌‌‌ శ్రీరామ్‌‌‌‌ మాత్రం.. కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. పిటిషన్‌‌‌‌ వేసిన విషయమే తమకు తెలియదని, పేపర్లు, టీవీల్లో వార్తలు చూసి తెలుసుకున్నామని చెప్పారు. ఈ పిటిషన్‌‌‌‌ కాపీలు తమకు అందలేదని, గడువు ఇస్తే కౌంటర్‌‌‌‌ వేస్తామని లాయర్‌‌‌‌ చెప్పడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2021లో పిటిషన్‌‌‌‌ దాఖలైతే ఇప్పటి వరకు పిటిషన్‌‌‌‌ కాపీలు అందలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించింది. కౌంటర్‌‌‌‌ వేయకుండా కావాలని జాప్యం చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆక్షేపించింది. గత విచారణ సమయంలో కమ్మ సంఘం తరఫున ఎవరూ హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని, కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది.

ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు

కమ్మ, వెలమ కులాలకు భూమి కేటాయింపు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేయగా.. సంఘాల లాయర్లు కల్పించుకుని స్టేటస్‌‌‌‌ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన బెంచ్.. ఒకవేళ ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేపట్టి ఉంటే వాటిని కొనసాగించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. జీవో 47 అమలును నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ చేసింది. తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ భూముల్లో ఏవిధమైన నిర్మాణాలు చేయడానికి వీల్లేదని, ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణాలు కొనసాగించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.

ట్రస్టీగా ఉండాల్సిన సర్కార్‌‌.. భూములను ధారాదత్తం చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఏం కావాలి. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌‌కు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అగ్ర కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఏమిటి?. ప్రభుత్వమే కులాలను పెంచి పోషించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. హైటెక్‌‌ తెలంగాణ స్టేట్‌‌లో ఇదేం పద్ధతి?

- హైకోర్టు