మెట్రో రెండో దశ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో..పురావస్తు కట్టడాల స్కెచ్ ఇవ్వండి..మెట్రో రైల్వేకు హైకోర్టు ఆదేశాలు

మెట్రో రెండో దశ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో..పురావస్తు కట్టడాల స్కెచ్ ఇవ్వండి..మెట్రో రైల్వేకు హైకోర్టు ఆదేశాలు

హైదారాబాద్, వెలుగు: ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌‌‌‌నుమా వరకు చేపట్టిన మెట్రో రెండో దశ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉన్న పురావస్తు కట్టడాల స్కెచ్‌‌‌‌ను అందజేయాలంటూ మెట్రో రైల్వేకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉన్న చారిత్రక కట్టడాలు, క్రాసింగ్‌‌‌‌లు, ఓవర్‌‌‌‌హెడ్‌‌‌‌లు తదితరాలను గుర్తించి స్కెచ్ సమర్పించాలని స్పష్టం చేసింది. విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.

ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రెండో దశ విస్తరణ పనులను నిలిపివేయాలంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌‌‌‌ల ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది రామారావు వాదిస్తూ..ప్రస్తుత మెట్రో విస్తరణ పనుల వల్ల పరిసర ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

చార్మినార్, ఫలక్‌‌‌‌నుమా ప్యాలెస్, పురానాహవేలి, దారుల్‌‌‌‌షిఫా, అజాఖాన్ ఆయేజెహ్రా, ఇమా మసీద్, మొఘల్‌‌‌‌పురా టూంబ్స్ తదితర కట్టడాలకు ప్రమాదం వాటిల్లుతుందన్నారు. అందువల్ల మెట్రో పనులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.మెట్రో రైల్వే తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌‌‌‌ఖాన్ వాదిస్తూ..పురావస్తు కట్టడాలను తాకకుండా పనులు చేపడతామని గతంలోనే హామీ ఇచ్చామన్నారు. 

మెట్రో రెండో దశలో ప్రార్థనా మందిరాలు, సమాధులు, ఈద్గాలు ఉన్నాయని, అయితే వీటి పైనుంచి మెట్రో వెళ్తుందన్నారు. ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. వాదనలను విన్న బెంచ్‌‌‌‌..మెట్రో అలైన్‌‌‌‌మెంట్ స్కెచ్‌‌‌‌ను పరిశీలించి విచారణ చేపడతామని తెలిపింది. కమిషన్ నియమించాలని పిటిషనర్ తరఫు అడ్వొకేట్ కోరగా, అవసరమని భావించినపుడు పరిశీలిస్తామంటూ నిరాకరించి విచారణను వాయిదా వేసింది.