‘బూటు కాలితో ఎందుకు తన్నారు? నోరెందుకు నొక్కారు?’

‘బూటు కాలితో ఎందుకు తన్నారు? నోరెందుకు నొక్కారు?’
  • అమరావతిలో పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం

ఏపీ సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని కోసం నిరసన చేస్తున్న మహిళా రైతుల పట్ల పోలీసుల తీరును ప్రశ్నించింది. విజయవాడలో చేపట్టిన మహిళల ర్యాలీలో పాల్గొన్న 610 మందిని ఎందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర అడ్వకేట్ జనరల్(ఏజీ) ని ప్రశ్నించింది. నిరసనలో పాల్గొన్న వారి ఐడీ కార్డులు, వ్యక్తిగత సమాచారం ఎందుకు సేకరించారో తెలపాలని ఆదేశించింది.  ఓ మహిళను మగ పోలీసు బూటు కాలితో తన్నడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మహిళ నోరును బలవంతంగా ఎందుకు నొక్కారంటూ అడిగింది.

అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప సెక్షన్ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేయాలని సుప్రీం ఆదేశాలున్నా ఎందుకు అమలు చేశారని ప్రశ్నించింది. రాజధాని వీధుల్లో పోలీసుల ఫాస్ట్ పరేడ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని,  ముందు జాగ్రత్త చర్యగా అల్లర్లు జరగకుండా పోలీసులు మోహరించారని ఏజీ కోర్టుకు తెలిపారు.