కాంట్రాక్టర్ల బిల్లులు  చెల్లించాల్సిందే .. మరోసారి తేల్చి చెప్పిన హైకోర్టు

కాంట్రాక్టర్ల బిల్లులు  చెల్లించాల్సిందే .. మరోసారి తేల్చి చెప్పిన హైకోర్టు

విచారణ వచ్చే నెల 4 కువాయిదా

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లందరికి బిల్లులు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉచిత పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే ఎలాగని ప్రశ్నించింది. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లిలోని శ్రీపాదసాగర్‌‌ మొదటి దశ పనులకు చెందిన రూ.76. 53 కోట్లు,  మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కోడేరు మండలు జొన్నలబొగుడలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులకు చెందిన రూ. 28. 97 కోట్లు ఏప్రిల్‌‌ 4వ తేదీలోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గత డిసెంబర్‌‌లో బిల్లులను పది రోజుల్లోగా చెల్లించాలన్న ఆదేశాలను అమలు చేయలేదంటూ నవయుగ–ఐవీఆర్‌‌సీఎల్‌‌–ఎస్‌‌ఈడబ్ల్యూలతో కూడిన సంయుక్త భాగస్వామ్య సంస్థ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ను దాఖలు చేసింది. దీనిని జస్టిస్‌‌ జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి గురువారం విచారించారు. బిల్లులు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను ఎలా అమలు చేయించాలో తెలుసునని ఫైర్ అయ్యింది.  బిల్లులను ఏప్రిల్‌‌ 4వ తేదీలోగా చెల్లించాల్సిందేనని, లేకుంటే నీటిపారుదల శాఖ అధికారి రాహుల్‌‌ బొజ్జా స్వయంగా విచారణకు రావాలని ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది. విచారణను ఏప్రిల్‌‌ 4కి వాయిదా వేసింది.