హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీగా జీతభత్యాలు, వసతులు ఉన్నప్పటికీ వాళ్ల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని హైకోర్టు పేర్కొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆ ఉద్యోగుల శక్తిసామర్థ్యాలను అతిగా వినియోగించుకోవడంతో చిన్న వయసులోనే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
తన రాజీనామాను అనుమతించడానికి రూ.5.9 లక్షల పరిహారం చెల్లించాలన్న కంపెనీ డిమాండ్ చట్టవ్యతిరేకమని కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోలేదంటూ పి.రాజేశ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారించి తీర్పు వెలువరించారు. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వ్యాపారం, వాణిజ్యం చేపట్టకుండా నిరోధించే ఒప్పందం ఏదీ చెల్లదన్నారు.
పిటిషనర్ 2019లో ఉద్యోగంలో చేరినపుడు అగ్రిమెంట్ పేపర్‌పై సంతకం చేశారని, 2022 వరకు ఉద్యోగం చేశారని, ఎప్పటికప్పుడు అగ్రిమెంట్ పెంచారని గుర్తించారు. ఇలాంటి వ్యవహారాలపై కార్మిక శాఖ అధికారులు చట్టాల అమలు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విజయ బ్యాంక్ వర్సెస్ ప్రశాంత్ బి.నర్నవారె కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆయన ఉదహరించారు.
ఈ కేసులో పిటిషనర్ పరిహారం చెల్లించాలని కంపెనీ ఏ ప్రాతిపదికన నిర్ణయించిందో తేల్చాలని కార్మిక శాఖను ఆదేశించారు. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలని కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు.
