పబ్లిక్ లోకి వచ్చాక లీక్ ఎట్లవుతది?.. హైకోర్టు ప్రశ్న

పబ్లిక్ లోకి వచ్చాక లీక్ ఎట్లవుతది?.. హైకోర్టు ప్రశ్న

10వ తరగతి  క్వశ్చన్‌ పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక అది లీకేజ్ ఎలా అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు బండి సంజయ్ చేసిన తప్పేంటని అడిగింది. పేపర్‌ బయటకు వచ్చాక వాట్సాప్‌లో ఫార్వార్డ్ మాత్రమే చేశాడని...కానీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్ పాత్ర లేదు కదా అని చెప్పింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని పేర్కొంది. 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్‌ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై   తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.... ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది.

ఇప్పటికే కింది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశామని బండి సంజయ్ తరపు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. దానిపై ఏప్రిల్ 06వ తేదీనే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని కోరారు. మార్చి8వ తేదీన ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో .. సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కింది కోర్టులో బెయిల్‌ రాకుంటే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

బండి సంజయ్ను  41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారని ..హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాలని  ఆయన తరపున న్యాయవాది రామచంద్రరావు హైకోర్టును కోరారు. కరీంనగర్ నుంచి వరంగల్‌కు బండి సంజయ్‌ను  తీసుకెళ్లేందుకు 300 కిలోమీటర్లు తిప్పారని  తెలిపారు. ప్రభుత్వం తరుపున  అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. 10వ తరగతి పేపర్ లీకేజీలో బండి సంజయ్  కుట్రదారుడు అన్న విషయం తేలిందని కోర్టుకు తెలిపారు.  ప్రశాంత్‌కు, సంజయ్‌కు మధ్య ఫోన్  సంభాషణ జరిగిందని.. కానీ ఆయన ఇంకా తన ఫోన్‌ను ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి తీసుకు వచ్చారు.