- హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ హీరా గ్రూప్ సంస్థల ఆస్తుల వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు పదేపదే పిటిషన్లు దాఖలు చేసినందుకు ఆ సంస్థ అధినేత్రి నౌహీరా షేక్‌కు హైకోర్టు భారీ జరిమానా విధించింది. హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.5 కోట్ల ఫైన్ వేసింది.
కోర్టు సమయాన్ని వృథా చేసినందుకే జరిమానా విధిస్తున్నట్లు జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు చెప్పారు. ఈ మొత్తాన్ని 8 వారాల్లో ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని ఆదేశించారు. హీరా గ్రూప్ పెట్టుబడిదారులకు అత్యధిక లాభాలు ఇస్తామని నమ్మించి తెలంగాణ, ఏపీ,కర్నాటక, ఇతర రాష్ట్రాల్లోని లక్షలాది మందిని మోసం చేసిన ఆరోపణలపై నౌహీరా షేక్‌పై కేసులు నమోదయ్యాయి.
400 కోట్ల విలువైన స్థిరాస్తులు అటాచ్
ఈడీ దర్యాప్తులో రూ. వేల కోట్ల మోసం బయటపడింది. డబ్బును విదేశాలకు మళ్లించే ప్రయత్నాలను ఆపిన అధికారులు.. నౌహీరాకు చెందిన రూ.45 కోట్ల విలువైన 13 ఆస్తులు, రూ.25 కోట్ల విలువైన 11 బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.400 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈడీ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) పోర్టల్‌లో ఆస్తులను వేలానికి పెట్టింది. కానీ నౌహీరా షేక్ ఈ నెల 26న వేలాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
అధికారులు మార్కెట్ విలువ కంటే తక్కువకు బిడ్డింగ్ ధర కోట్ చేశారని ఆరోపించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక కొట్టివేశారు. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు, కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినందుకు రూ.5 కోట్ల జరిమానాను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 8 వారాల్లో చెల్లించాలన్నారు. పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా హైకోర్టు చరిత్రలోనే భారీ జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పారు.
