పీడీ యాక్ట్‌‌ దుర్వినియోగం చేస్తే ఎట్ల..రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

పీడీ యాక్ట్‌‌  దుర్వినియోగం చేస్తే ఎట్ల..రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
  • సరైన కారణాల్లేకుండా పీడీ యాక్ట్‌‌ సరికాదని కామెంట్​
  • ఏడాదిలో 108 పీడీ కేసులు కొట్టేసినట్టు వెల్లడి.. నలుగురిపై  పీడీ యాక్ట్‌‌ జీవోను రద్దు చేస్తూ తీర్పు
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
  • నలుగురిపై పీడీ యాక్ట్‌‌ జీవోను రద్దు చేస్తూ తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఒక నేరానికి సంబంధించిన కేసులో నిందితులు జ్యుడీషియల్‌‌ కస్టడీలో ఉండగా సరైన కారణాలు పేర్కొనకుండా పీడీ యాక్ట్‌‌ అమలు చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఏకపక్షంగా పీడీ చట్టం అమలు చేయడం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులకు భంగం ఏర్పడుతుందని తెలిపింది. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాకు చెందిన నలుగురిపై కలెక్టర్‌‌ పీడీ యాక్ట్‌‌ ప్రయోగానికి ఉత్తర్వులివ్వడాన్ని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం జీవో 323ను జారీ చేయడాన్ని రద్దు చేసింది. ఒక కేసులో జైల్లో ఉన్న వ్యక్తులపై పీడీ యాక్ట్‌‌ ప్రయోగించి, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా అని జస్టిస్‌‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌‌ పి.శ్రీసుధల డివిజన్‌‌ బెంచ్‌‌ రాష్ట్ర సర్కార్‌‌‌‌ను ప్రశ్నించింది. 

ల్యాండ్‌‌ వివాదంలో నిందితులుగా ఉన్న అబ్దుల్‌‌ అహ్మద్, అబ్దుల్‌‌ నవాజ్, మహ్మద్‌‌ రహమత్, షేక్‌‌ అసిమ్లపై ఏప్రిల్‌‌ 10న కలెక్టర్‌‌ పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని ప్రభుత్వం ధ్రువీకరిస్తూ జీవో 323 జారీ చేసింది. దీనిని వారి బంధువు అబ్దుల్‌‌ రహమాన్‌‌ హైకోర్టులో సవాల్‌‌ చేశాడు. నిందితుల తరఫు లాయర్‌‌‌‌ వాదిస్తూ.. ఆ నలుగురిపై ల్యాండ్‌‌ వివాద కేసు మాత్రమే ఉందని, పీడీ యాక్ట్‌‌ ప్రయోగించాల్సిన పరిస్థితులు ఏమీ లేవన్నారు. సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ను ఉల్లంఘించి ప్రభుత్వం పీడీ యాక్ట్‌‌ ప్రయోగించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ లాయర్‌‌‌‌ వాదిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 

ఏడాదిలో 108 పీడీ కేసులు కొట్టేశాం..

ఇరు వాదనలు విన్న హైకోర్టు స్పందిస్తూ.. తెలంగాణలో పీడీ చట్టం వినియోగంపై పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. గడిచిన ఏడాదిలోనే 108 పైగా పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టేశామని, ఈ లెక్కలు చూస్తే ఈ యాక్ట్‌‌ ఎంతగా దుర్వినియోగం అవుతుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ఒక వ్యక్తికి సంబంధించి నష్టం కలిగించేలా నేరం చేస్తే.. అది శాంతి భద్రతల పరిధిలోకి వస్తుందని, ఆ వ్యక్తి చేసే నేరం సమాజంపై ప్రభావం చూపితే అది ప్రజా శాంతికి భంగం కలిగిస్తుందన్నారు. 

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పిందని, అయినా ప్రభుత్వంలో మార్పు లేకుండా పీడీ యాక్ట్‌‌ను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌‌ చేశారని, వారు జ్యుడీషియల్‌‌ కస్టడీల్లో ఉన్నారని, నిందితులపై ఆరోపించిన ఏ నేరాభియోగం ప్రజాశాంతికి భంగం కలిగించదని చెప్పింది. వారిపై ఏ ఇతర క్రిమినల్‌‌ కేసులు లేకపోతే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.