
- ఇది ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యతలోకి చొరబాటే: హైకోర్టు
- సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ వేయండి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, హైకోర్టు జడ్జీల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం తీవ్రంగా పరిగణించాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యతలోకి చొరబాటేనని మండిపడింది. సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఎస్‌బీఐ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం అదనపు డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు.
ఈ దశలో సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని.. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందన్నారు. పీయూసీఎల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏర్పాటైన కమిటీ దృష్టికి ఈ అంశం వెళ్లాల్సి ఉందన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ దశలో ఎలాంటి సూచనలు అవసరం లేదని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాక కోర్టుకు సహకరించవచ్చని పేర్కొన్నది. సుమోటో తీసుకున్న అంశంపై ఒకే రోజులో ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.