మెరిట్‌‌ ప్రకారం పోల్‌‌ టెస్ట్ నిర్వహించండి .. జూనియర్‌‌ లైన్‌‌మన్‌‌ పోస్టుల భర్తీపై హైకోర్టు

మెరిట్‌‌ ప్రకారం పోల్‌‌ టెస్ట్ నిర్వహించండి .. జూనియర్‌‌ లైన్‌‌మన్‌‌ పోస్టుల భర్తీపై హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: జూనియర్‌‌ లైన్‌‌మన్‌‌ పోస్టుల భర్తీకి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌‌ ప్రకారం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అర్హులకు కరెంట్‌‌ పోల్‌‌ టెస్ట్‌‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న మెరిట్‌‌ లిస్ట్‌‌ ప్రకారం అర్హులైన వారికి పోల్‌‌ టెస్ట్‌‌ నిర్వహణకు సంబంధించి కాల్‌‌ లెటర్లు పంపాలని చెప్పింది. 2018 ఫిబ్రవరి 16న జారీ చేసిన నోటిఫికేషన్‌‌లో తాము పరీక్షలో అర్హత సాధించినా, పోల్‌‌ టెస్ట్‌‌కు కాల్‌‌ లెటర్‌‌ పంపలేదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌‌ జువ్వాడి శ్రీదేవి ఇటీవల తీర్పు వెలువరించారు.

పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌ వాదిస్తూ, 2018లో 2,553 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌‌ ఇచ్చారని, అయితే, 2,325 పోస్టులను మాత్రమే నింపారన్నారు. మిగిలిన 228 పోస్టులను భర్తీ చేయలేదని తెలిపారు. ఒక నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న పోస్టులను మరో నోటిఫికేషన్‌‌ ద్వారా భర్తీకి వీలులేదని చెప్పారు. పరీక్షలో అర్హత పొందిన వారిని నియమించకపోవడం చట్ట వ్యతిరేకమన్నారు. పోల్‌‌ టెస్ట్‌‌ జరగనందున పిటిషనర్ల అర్హత వెల్లడి కాలేదని టీఎస్‌‌ ఎన్పీడీసీఎల్ లాయర్‌‌ వాదించారు. అనంతరం మిగిలిన పోస్టులకు కాల్‌‌ లెటర్‌‌ పంపి, పోల్‌‌ టెస్ట్‌‌ నిర్వహించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

ఆలయాల నిర్వహణ సక్రమంగానే ఉంది...

రాష్ట్రంలోని ఆలయాల్లో అన్యమతస్తులకు చోటు ఇవ్వలేదని ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌‌తో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఆలయాల్లోనే కాకుండా ఆలయ కమిటీల్లోనూ  అన్యమతస్తులకు అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌‌ను అనుమతిస్తూ చీఫ్‌‌  జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రవణ్‌‌కుమార్‌‌ డివిజన్‌‌ బెంచ్‌‌ తీర్పు చెప్పింది. ఆలయాల నిర్వహణ సక్రమంగానే ఉందని పేర్కొంది.అన్యమతస్తులకు ఆలయాల్లో చోటు కల్పించకూడదని పడిన పిల్ ను కోర్టు డిస్మిస్‌‌ చేసింది.