జైలు నుంచి వచ్చాక నేరాలు చేస్తే.. పీడీ యాక్ట్‌‌‌‌ పెట్టొచ్చు

జైలు నుంచి వచ్చాక నేరాలు చేస్తే..  పీడీ యాక్ట్‌‌‌‌ పెట్టొచ్చు
  • హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నేరాలు చేస్తే, అతన్ని తిరిగి అదుపులోకి తీసుకొని పీడీ యాక్ట్‌‌ కింద కేసు నమోదు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. కాగా, ఈ యాక్ట్‌‌ కింద అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తిని విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్‌‌ఖాన్‌‌ను విడుదల చేయాలని అమీనా బేగం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌‌ను కొట్టేస్తూ జస్టిస్‌‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌‌ పి.శ్రీసుధ డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల తుది ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌‌ యూత్‌‌ కరేజ్‌‌ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సల్మాన్‌‌ ఖాన్‌‌పై 2022–23లో 9 కేసులు నమోదయ్యాయి. 

అందులో ఐదు కేసులను పరిశీలించాక పీడీ యాక్ట్‌‌ ప్రయోగించాలని పోలీసు కమిషనర్‌‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో 720ని గత మేలో జారీ చేసింది. అయితే, 2021లో సల్మాన్​పై పీడీ యాక్ట్‌‌ ప్రయోగిస్తే హైకోర్టు కొట్టేసింది. మళ్లీ పీడీ యాక్ట్‌‌ ప్రయోగించడాన్ని పిటిషనర్‌‌ సవాల్‌‌ చేసినా.. కేసు వీగిపోయింది. ఈ క్రమంలో కొత్త కేసుల ఆధారంగానే పీడీ యాక్ట్‌‌ ప్రయోగించారని హైకోర్టు వెల్లడించింది.