లాయర్ దంపతుల హత్య.. హైకోర్టు లాయర్ల విధుల బహిష్కరణ

లాయర్ దంపతుల హత్య.. హైకోర్టు లాయర్ల విధుల బహిష్కరణ
  • నేడు హైకోర్టు లాయర్ల విధుల బహిష్కరణ
  • హైకోర్టు బార్ అసోసియేషన్​ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: అడ్వొకేట్ దంపతులు గట్టు వామన్​రావు, నాగమణి దారుణ హత్యకు నిరసనగా గురువారం విధులను బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు బార్‌‌ అసోసియేషన్‌‌ ఒక ప్రకటనలో పేర్కొంది. అడ్వొకేట్లను దారుణంగా మర్డర్​ చేశారని..  దీనికి నిరసనగా లాయర్లు ఒక్కరోజు విధులకు దూరంగా ఉండాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ఈ హత్యలను ఖండించాలని పిలుపునిచ్చింది. లాయర్లు ఐక్యతను చాటుకోవాలంది. అడ్వొకేట్ల హత్యాలపై నిష్పక్షపాత విచారణ చేయాలని, పోలీసులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలంది. హైకోర్టు వద్ద గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా చేయాలని నిర్ణయించింది. నాంపల్లి కోర్ట్ కాంపౌండ్ వద్ద గురువారం 10 గంటలకు, ధర్నా చేయనున్నట్లు అడ్వొకేట్ జి.జితేందర్‌‌రెడ్డి చెప్పారు.

హైకోర్టు గేటు వద్ద లాయర్ల ధర్నా

వామన్​రావు దంపతుల హత్యను ఖండిస్తూ బుధవారం హైకోర్టు నాలుగో గేటు వద్ద లాయర్లు ధర్నా చేశారు. పిల్స్ వేసి ప్రజల తరఫున పోరాటం చేసిన అడ్వొకేట్ దంపతులను కిరాతంకంగా హత్య చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్‌‌ చేశారు. నిందితులను కాపాడేలా పాలకులు, పోలీసుల చర్యలు ఉండకూడదని డిమాండ్‌‌ చేశారు. ధర్నాలో రాపోలు భాస్కర్, జనార్దన్‌‌ గౌడ్, చిక్కుడు ప్రభాకర్‌‌ తదితరులు పాల్గొన్నారు.

సిట్టింగ్‌‌ జడ్జితో విచారణ చేయించాలి

అడ్వొకేట్​ దంపతుల హత్య దోషులకు శిక్ష పడేందుకు హైకోర్టు సిట్టింగ్‌‌ జడ్జితో విచారణ చేయాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌ ఒక ప్రకటనలో డిమాండ్‌‌ చేశారు. ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ కోర్టు ఏర్పాటు చేసి సత్వర విచారణ చేయాలన్నారు. హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన, టీఆర్‌‌ఎస్‌‌ నేత పుట్టా మధు ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, మంథని నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపైన, మంథని పోలీస్‌‌ స్టేషన్‌‌లో శీలం రంగయ్య అనే వ్యక్తి లాకప్‌‌ డెత్‌‌పై హత్యకు గురైన పిల్స్‌‌ వేశారని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడేందుకు పాటుపడుతున్న న్యాయవాదులను మర్డర్ చేయడం దారుణమన్నారు. నిందితుల తరఫున ఎవరూ కేసు వాదించవద్దని కోరారు. గురువారం హైకోర్టు గేటు బయట న్యాయవాదులు నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు.

8న హైకోర్టు ఉత్తర్వులు.. అంతలోనే హత్య

మంథని పోలీస్‌‌ స్టేషన్‌‌లో శీలం రంగయ్య అనే వ్యక్తి లాకప్‌‌ డెత్‌‌పై పిల్‌‌ వేసిన న్యాయవాది గట్టు వెంకట నాగమణి, ఆమె భర్త గట్టు వామనరావుల జోలికి పోలీసులు వెళ్లరాదని ఇటీవలే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు గతంలోని ఉత్తర్వులను చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమాకోహ్లీ, జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ ఈ నెల 8న హైకోర్టు పొడిగించింది. అంతలోనే వారిద్దరూ హత్యకు గురయ్యారు. గతేడాది మే 22న రంగయ్యను అరెస్టు చేసిన పోలీసులు చిత్ర హింసలకు గురిచేయడంతో అదే నెల 25న మంథని లాకప్‌‌లో మరణించారని నాగమణి రాసిన లెటర్​ను హైకోర్టు పిల్‌‌గా తీసుకుంది. ఈ కేసు విచారణ సమయంలో పిటిషనర్‌‌ నాగమణి భర్త వామనరావుపై పోలీసులు అన్యాయంగా కేసులు బనాయించి పలు పోలీస్‌‌ స్టేషన్లకు తిప్పుతున్నారని ఆమె న్యాయవాది చెప్పారు. హైదరాబాద్‌‌లో ఉండే ఆమె భర్తపై రామగుండం కమిషనరేట్‌‌ పరిధిలోని అన్ని పీఎస్‌‌ల్లోనూ కేసులు పెట్టారని, మంచిర్యాలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారని చెప్పారు. ఈ వాదనలను ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వ్యతిరేకించినప్పుటికీ హైకోర్టు గతంలోని స్టే ఉత్తర్వుల్ని పొడిగించింది. పిటిషనర్‌‌ ఆమె భర్తలను కోర్టు అనుమతి లేకుండా పోలీసులు ఏ స్టేషన్‌‌కు తీసుకువెళ్లవద్దని హైకోర్టు ఆదేశించింది.

For More News..

ప్రజలు ఎవరి దగ్గరైనా కరెంటు కొనొచ్చు

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..

సాఫ్ట్​వేర్ కంపెనీలు మార్చిలో రీ ఓపెన్