- 12 మున్సిపల్ స్థానాలతో కాంగ్రెస్ పార్టీ రికార్డు ఫలితాలు
- ఈసారి సున్నా సీట్లకే పరిమితమైన బీఆర్‍ఎస్
- కాంగ్రెస్ ఖాతాలో సోమవారం 9, మంగళవారం 3 పీఠాలు
- జనగామ, తొర్రూర్ రెండుచోట్లా కాంగ్రెస్‍వైపే కలిసొచ్చిన లక్కీ డ్రా
- ఒక్కో ఎన్నికకు పడిపోతున్న గులాబీ పార్టీ గ్రాఫ్
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. సోమవారం నిర్వహించిన మున్సిపల్ చైర్‍పర్సన్ ఎన్నికల్లో 9 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మంగళవారం మిగతా 3 పీఠాలను కూడా దక్కించుకుంది. లక్కీ డ్రా రూపంలో కూడా కాంగ్రెస్కు కలిసొచ్చింది. కాగా, 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 9 పీఠాలను క్లీన్‍స్వీప్ చేసిన గులాబీ పార్టీ ఈసారి సున్నా స్థానాలకే పరిమితమైంది.
12 చైర్‍పర్సన్ పీఠాలతో హస్తం పార్టీ రికార్డు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో 9 మున్సిపాలిటీలు ఉండగా, ఈసారి మరో మూడు పెరిగి 12 మున్సిపాలిటీలయ్యాయి. 2020 ఎన్నికల సమయంలో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్ ఉండగా, ఈసారి ములుగు, స్టేషన్ ఘనపూర్, కేసముద్రం స్థానాలు కొత్తగా కలిశాయి. కాగా, ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం 12 మున్సిపాలిటీ చైర్‍పర్సన్ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. సోమవారం చైర్‍పర్సన్ ఎన్నికల సందర్భంగా 9 పీఠాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో డోర్నకల్ పూర్తి మెజార్టీతో తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రం మొత్తం జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల వైపు చూస్తున్న క్రమంలో లక్కీడ్రాలో కూడా అదృష్టం హస్తం పార్టీ నేతలనే వరించింది.
నాడు క్లీన్‍స్వీప్.. నేడు సున్నా
2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓరుగల్లు నుంచి నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్ 9 స్థానాల్లో బీఆర్‍ఎస్ పార్టీ చైర్‍పర్సన్ పీఠాలను కైవసం చేసుకుంది. 9 మున్పిపాలిటీల పరిధిలో 200 వార్డులు ఉంటే, 134 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈసారి స్టేషన్‍ఘనపూర్, ములుగు, కేసముద్రం రూపంలో 3 మున్సిపాలిటీలతో కలిపి ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలకు పెరిగింది. వార్డుల సంఖ్య 260కి పెరిగింది. కాగా, గతంలో 200 సీట్లలోనే 134 గెలిచిన గులాబీ పార్టీ ఈసారి మరో 50 స్థానాలు పెరిగినా 88 సీట్లకే పరిమితమైంది. నాడు 33 స్థానాల్లోనే గెలిచిన కాంగ్రెస్ ఈసారి 12 పీఠాలతో కలిసి దాదాపు 150 వార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
సీన్ రీపిట్ ఫలితాలు..
ఓరుగల్లులో బీఆర్‍ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చూపిన ఎన్నికలు ఫలితాలు ప్రస్తుతం సీన్ రిపీట్ చేస్తున్నాయి. 2018 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ 12 నియోజకవర్గాల్లో 10 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 2 విజయం సాధించింది. 2023 ఎన్నకలనాటికి కాంగ్రెస్ 10చోట్ల గెలిస్తే బీఆర్‍ఎస్ 2కు పరిమితమైంది. 2019 ఎంపీ ఎన్నికల్లో బీఆర్‍ఎస్ వరంగల్, మహబూబాబాద్ స్థానాలతో హవా చూపగా కాంగ్రెస్ సున్నా వచ్చాయి. 2024 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇవే 2 పార్లమెంట్ స్థానాలు గెలవగా, బీఆర్‍ఎస్ సున్నాఫలితాలు వచ్చాయి. 2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓరుగల్లులోని 9 మున్సిపల్ పీఠాలను బీఆర్‍ఎస్ క్లీన్‍స్వీప్ చేయగా, హస్తం పార్టీ సున్నాకే పరిమితమైంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లులోని 12 పీఠాలను సాధించి రికార్డు సృష్టించగా, బీఆర్‍ఎస్ గ్రాఫ్ సున్నాకు పడిపోయింది.
డోర్నకల్ పీఠం.. కాంగ్రెస్ వశం
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 9 చోట్ల కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలుపొందారు. సోమవారం మున్సిపాలిటీ నూతన కమిటీ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సకాలంలో కౌన్సిలర్లు మున్సిపాలిటీకి చేరకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్ చొరవతో మంగళవారం డోర్నకల్ మున్సిపాలిటీ నూతన కమిటీ ఎన్నిక ప్రశాంతంగా మూసింది. చైర్ పర్సన్ గా కొండేటి రాజకుమారి, వైస్ చైర్ పర్సన్ గా మాద లావణ్య ఎన్నికైనట్లు అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ ప్రకటించారు.
