హిమాయత్ సాగర్​, ఉస్మాన్‌‌ సాగర్‌‌‌‌ పరిధిలోని.. కన్వెన్షన్‌‌ సెంటర్లకు హైకోర్టు నోటీసులు

హిమాయత్ సాగర్​, ఉస్మాన్‌‌ సాగర్‌‌‌‌ పరిధిలోని.. కన్వెన్షన్‌‌ సెంటర్లకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: హిమాయత్‌‌సాగర్, ఉస్మాన్‌‌సాగర్‌‌ పరీవాహక ప్రాంతాల్లో జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన కన్వెన్షన్‌‌ సెంటర్ల అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి, ఆ కన్వెన్షన్‌‌ సెంటర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవో 111కు విరుద్ధంగా నీటి పరీవాహక ప్రాంతాల్లో పెద్దపెద్ద కన్వెన్షన్‌‌ సెంటర్లను అక్రమంగా నిర్మిస్తున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌ మండలానికి చెందిన మందాడి మాధవరెడ్డి హైకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు.

దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌‌ తరఫు లాయర్ పి.శశిధర్‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడంలేదన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో వ్యవస్థలు వైఫల్యం చెందడంతో ఇటీవల ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చిందన్నారు.

శంకర్‌‌పల్లి మెయిన్‌‌రోడ్డులోని జన్వాడ ప్రాంతంలో ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో వెలిసిన కన్వెన్షన్‌‌ సెంటర్లు రోజుకు 3 నుంచి 5 వేల మందికి ఆతిథ్యం ఇస్తున్నాయన్నారు. ఈ పంక్షన్‌‌లప్పుడు ఘన, ద్రవ, ఆహార వ్యర్థాలను నేరుగా చెరువుల్లోకి వదులుతుండటంతో అవి కలుషితమవుతున్నాయని కోర్టుకు తెలిపారు. కన్వెన్షన్‌‌ సెంటర్ల నిర్మాణాలు తెలంగాణ బిల్డింగ్‌‌ నిబంధనలు, వాల్టా, నాలా చట్టాలకు విరుద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్‌‌ఎండీఏ, జలమండలి, జీహెచ్‌‌ఎంసీ, లేక్‌‌ ప్రొటెక్షన్‌‌ కమిటీ, ఆనంద కన్వెన్షన్, నియో కన్వెన్షన్, ఆర్య కన్వెన్షన్, కెఎల్‌‌ఎన్‌‌ ఉత్సవ్, కె కన్వెన్షన్‌‌లకు నోటీసులిచ్చింది. వేసవి సెలవుల తర్వాతకు విచారణ వాయిదా వేసింది.