
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
- ఆగస్టు 16కు విచారణ వాయిదా వేస్తున్నట్లు వెల్లడి
- కోకాపేటలో బీఆర్ఎస్కు భూములపై..సర్కార్కు నోటీసులు
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
- ఆగస్టు 16కు విచారణ వాయిదా వేస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నంబర్ 239, 240లోని 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్, హెచ్ఎండీఏ, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామారపు రాజేశ్వర్తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు కోసం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ ఎం.పద్మనాభ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన తరఫున సీనియర్ అడ్వకేట్ సరసాని సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన 11 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నారు. ప్రస్తుతం ఎకరా రూ.50 కోట్లకు పైగా ఉందని, ప్రభుత్వం మాత్రం రూ.3.41 కోట్లకే అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేసిందని కోర్టుకు విన్నవించారు. సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.37 కోట్లకే ఇచ్చేయడం దారుణమన్నారు. భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, ట్రస్టీగా వ్యవహరించాల్సిన సర్కార్ ఇష్టానుసారంగా కేటాయించడం చట్టవ్యతిరేకమని తెలిపారు. వేలం నిర్వహించలేదని, కనీసం ప్రకటన కూడా చేయలేదని చెప్పారు. భూమి కేటాయింపునకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పటికీ ప్రభుత్వం రహస్యంగా ఉంచిందన్నారు.
పబ్లిక్ డొమైన్లో జీవో పెట్టలేదన్న పిటిషనర్ తరఫు అడ్వకేట్
గవర్నమెంట్ తరఫు అదనపు ఏజీ రామచందర్ స్పందిస్తూ.. భూముల విలువలను పిటిషనర్ ఇష్టానుసారంగా నిర్ణయించి చెప్పడం సరికాదన్నారు. ఈ వ్యవహారం కేబినెట్ ముందు ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కేబినెట్ ముందున్న వ్యవహారంపై పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఎకరా ధర రూ.100 కోట్లుగా నిర్ణయిస్తే ప్రభుత్వానికి లాభమే వస్తుందని తెలిపింది. జీవో రాకుండానే పిల్ ఎలా వేస్తారని నిలదీసింది. దీనిపై పిటిషనర్ తరఫు అడ్వకేట్ సత్యం రెడ్డి స్పందిస్తూ.. కేటాయింపులకు సంబంధించిన జీవో కూడా వచ్చిందని, ప్రభుత్వమే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని కోర్టుకు వివరించారు. పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా జరిగినట్లు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయన్నారు. సమయం ఇస్తే కౌంటర్ వేస్తామని ఏఏజీ రామచందర్ చెప్పడంతో.. అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది.