ధరణి సమస్యలు నెలలోగా పరిష్కరించండి.. హైకోర్టు ఉత్తర్వులు

ధరణి సమస్యలు  నెలలోగా పరిష్కరించండి..  హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్​తో సమస్యలు మరిన్ని పెరిగాయని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులో దాఖలయ్యే కేసులను బట్టి చూస్తే ధరణిలో 20కిపైగా సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొంది. వాటిని నెల రోజుల్లోగా పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌ సెక్రటరీ, సీసీఎల్‌‌ఏకు ఉత్తర్వులు ఇచ్చింది. ధరణి సమస్యలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ ఇటీవల మరోసారి విచారణ చేపట్టారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొని, జూన్‌‌ 15న జరిగే విచారణలో వివరించాలని అధికారులను ఆదేశించారు. 

మద్యం వ్యాపారం ప్రాథమిక హక్కు కాదు..  

కల్లు, మద్యం బిజినెస్‌‌ చేయడం ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. డైజోపామ్‌‌ కలిపి కల్లు కల్తీ చేసినట్లు గుర్తించాకే నిజామాబాద్‌‌ జిల్లాలో 12 కల్లు దుకాణాల లైసెన్స్‌‌లను రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కల్తీ కల్లు అమ్మారని నిజామాబాద్‌‌లోని 12 షాపుల లైసెన్స్‌‌లను ప్రభుత్వం 2022 మార్చి 14న రద్దు చేసింది. తర్వాత డిసెంబర్‌‌ 31న తిరిగి పునరుద్ధరించింది. ఇది చట్ట వ్యతిరేకమంటూ నిజామాబాద్‌‌కు చెందిన రాజాగౌడ్‌‌, ఇతరులు పిటిషన్‌‌ వేయగా.. సింగిల్‌‌ జడ్జి విచారణ చేపట్టి సమర్థించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ 12 షాపుల ఓనర్లు వేసిన పిటిషన్లపై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టి కొట్టేసింది.