టీఎస్ఆర్టీసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

టీఎస్ఆర్టీసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి తీసుకున్న డబ్బును సీసీఎస్‌కు జమ చేయాలని, ఆ నిధుల్ని ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌ వాడుకోవద్దని హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు వచ్చాయి. దీనిపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున అడ్వొకేట్ ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగుల జీతాల నుంచి కట్‌ చేసిన మొత్తాన్ని సీసీఎస్‌ ఖాతాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రతివాదుల తరఫున అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ.. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వంతో ఆర్టీసీ ఎండీ చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

అధికారులకు నోటీసులు

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతోపాటు పలువురిని పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై జడ్జి జస్టిస్‌ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే సోమవారానికి జడ్జి వాయిదా వేశారు.