
హైదరాబాద్, వెలుగు: విద్యా, ఉపాధి రంగాల్లో ట్రా న్స్‌జెండర్లకు రిజర్వేషన్‌లు కల్పించాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్‌లు, ఆసరా పింఛన్లు కల్పించాలంటూ 2023లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైదరాబాద్‌కు చెందిన వై.జయంతి వసంత మొగిలి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమశాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.