- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై 8 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా జీవో 9, 41, 42ల అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌లతోపాటు ఇందులో తమనూ ప్రతివాదులుగా చేర్చి తమ వాదనలూ వినాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
