- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వీధి కుక్కల నియంత్రణలో ఇటీవల సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీకాలు, స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను షెల్టర్ సెంటర్లకు తరలించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుపై చీఫ్ వెటర్నరీ అధికారి వ్యక్తిగతంగా కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 9కు వాయిదా వేసింది.
పాఠశాలలు, ఆస్పత్రులు, బస్‌డిపోలు, రైల్వే స్టేషన్‌లు, క్రీడాస్టేడియాలు తదితర ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలన్న వినతిపత్రాలను పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ ఎనిమల్ షెల్టర్ అడ్ రెస్క్యూ ఎయిడ్ (ఆస్రా) సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫున న్యాయవాదిరవిచందర్, శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల్లో 25ఎ నుంచి 25ఇ వరకు ఉన్నవాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు. గుర్తించిన ప్రాంతాలు, నోడల్ అధికారుల నియామకం, దీర్ఘకాలిక ఆశ్రయం కల్పించడానికి అవసరమైన కేంద్రాల ఏర్పాటు, హెల్ప్‌లైన్, గణాంకాల లెక్కల కోసం ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలివ్వాలని కోరారు.
వాదనలను విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, దీనికి ప్రస్తుత ఉత్తర్వులు ఎలాంటి అడ్డంకి కాదన్నారు. రెండు అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను సందర్శించి మొబైల్‌తో చిత్రీకరించడానికి పిటిషనర్‌కు అనుమతించాలని, ఇందులో ఎలాంటి ఇబ్బందులు సృష్టించరాదంటూ విచారణను వాయిదా వేశారు.
