క్యాబ్‌‌ను ఓమ్ని బస్‌‌గా మార్చేందుకు అనుమతించండి..రవాణా శాఖకు హైకోర్టు ఆదేశం

క్యాబ్‌‌ను ఓమ్ని బస్‌‌గా మార్చేందుకు అనుమతించండి..రవాణా శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి నిబంధనలు లేకుండా  మ్యాక్సి క్యాబ్‌‌ నుంచి ఓమ్ని బస్‌‌ (నాన్‌‌ట్రాన్స్‌‌పోర్టు)గా మార్పునకు తిరస్కరించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి నష్టమని, రోడ్డు ప్రమాదాలకు, అక్రమంగా ప్యాసింజర్ల వెహికల్ లా ఉపయోగిస్తారనే కారణాలతో మార్పిడికి నిరాకరించడం కరెక్ట్ కాదని తెలిపింది. పిటిషనర్‌‌కు చెందిన వాహనాన్ని క్యాబ్‌‌ నుంచి ఓమ్ని బస్‌‌గా మార్పిడికి 6 వారాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తన ఇన్నోవా వాహనాన్ని మ్యాక్సి క్యాబ్‌‌ నుంచి ఓమ్ని బస్‌‌గా (రవాణాయేతర) మార్చడాన్ని తిరస్కరిస్తూ రవాణా శాఖాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైదరాబాద్‌‌కు చెందిన సి.రత్నాజీరావు హైకోర్టులో సవాల్ చేశారు. 

ఈ పిటిషన్‌‌ ను జస్టిస్‌‌ కె.శరత్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..మ్యాక్సిక్యాబ్‌‌గా ప్రతి మూడు నెలలోకోసారి ఎలాంటి బకాయిలు లేకుండా పన్నుతో సహా చెల్లించానన్నారు. అవసరమైన ఫీజులు చెల్లించి మార్పిడికి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..మ్యాక్సీ క్యాబ్‌‌కు, ఓమ్ని బస్‌‌కు పన్నుల చెల్లింపులో తేడా ఉందన్నారు. అంతేగాకుండా.. మార్పిడి తరువాత అక్రమంగా వాహనాన్ని ప్యాసింజర్ల కోసం వినియోగించే అవకాశం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. మార్పిడిపై నిషేధానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు. రూల్స్ లేకుండా అడ్డుకోవడం చెల్లదన్నారు. 6 వారాల్లో వాహనం మార్పిడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ రవాణాశాఖ అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.