రూ.150 కోట్లు కట్టాల్సిందే.. ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం

రూ.150 కోట్లు కట్టాల్సిందే.. ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ( సీసీఎస్ )కి వచ్చే నెల 15 కల్లా రూ.50 కోట్లు, 25వ తేదీలోగా మరో రూ.100 కోట్లు కట్టాల్సిందేనని ఆర్టీసీని హైకోర్టు  ఆదేశించింది. సీసీఎస్ కు చెల్లించాల్సిన మొత్తం బకాయిలపై హైకోర్టులో ఇటీవల విచారణ జరగగా శుక్రవారం  జడ్జ్ మెంట్ కాపీ అందింది. అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.1035 కోట్లు సీసీఎస్ కు ఆర్టీసీ బకాయి పడింది. గతేడాది నవంబర్ లోనే  రెండు నెలల్లో రూ.200 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించగా..ఆర్టీసీ చెల్లించలేదు. మరో 6 నెలల టైమ్ అడగడంతో  హైకోర్టు అంగీకరించింది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.40 కోట్లు మాత్రమే దశల వారీగా ఆర్టీసీ సీసీఎస్ కు చెల్లించింది.

6 నెలల గడువు వచ్చే నెల 25న ముగియనుండటంతో అప్పటిలోగా  రూ.150 కోట్లు చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పు వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల జీతాల్లో నుంచి ప్రతి నెల కట్ చేస్తున్న రూ. 18 కోట్లను కూడా సీసీఎస్ కే చెల్లించాలని మరో పిటిషన్ లో హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 8 కి వాయిదా వేసింది.