ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలె

ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలె

పోడు భూములకు జీవోకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కమిటీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. మరోవైపు జీవో 140ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కమిటీ వేసినట్లు గుర్తించిన జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం... జీవో చట్ట పరిధిలో లేదని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలని సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. 

పోడు భూములపై హక్కులను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసే కమిటీల్లో  రాజకీయ నాయకులకు స్థానం కల్పించడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి. ఇది  రాజ్యాంగ విరుద్ధమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేజావత్ శంకర్ ఎల్. అంజి, మీక్యా నాయక్లు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.