40 ఏండ్లుగా ఉంటున్నవాళ్లను.. ఎట్ల ఖాళీ చేయిస్తరు? : హైకోర్టు

40 ఏండ్లుగా ఉంటున్నవాళ్లను.. ఎట్ల ఖాళీ చేయిస్తరు? : హైకోర్టు
  • అదే అడ్రస్​పై ఆధార్ కార్డులున్నయ్
  • మియాపూర్​లోని సీఆర్​పీఎఫ్ స్థలం ఖాళీ చేయించొద్దు
  • ప్రతివాదులకు నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌‌‌‌లోని సుభాష్‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌ నగర్, ఓంకార్‌‌‌‌ నగర్, నందిగడ్డ తండాల్లో ఉంటున్న రెండు వేల కుటుంబాలను ఖాళీ చేయించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి వారిని ఖాళీ చేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన కేంద్ర హోంశాఖ, సీఆర్పీఎఫ్‌‌‌‌ డీజీ, బీసీ జాతీయ కమిషన్, కలెక్టర్, రాజేంద్రనగర్‌‌‌‌ ఆర్డీవో, శేరిలింగంపల్లి ఎమ్మార్వో, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌లకు నోటీసులు జారీ చేసింది. 40ఏండ్లుగా వారు ఆ స్థలాల్లో నివాసం ఉంటున్నారని, వాళ్లకు నల్లా, విద్యుత్‌‌‌‌ కనెక్షన్లు ఉన్నాయని, అదే అడ్రస్‌‌‌‌తో ఆధార్‌‌‌‌ కార్డులు ఉన్నాయని గుర్తు చేసింది. 

స్థలాలను ఖాళీ చేయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపడుతూ డాక్టర్‌‌‌‌ పీఆర్‌‌‌‌ సుభాష్‌‌‌‌ చంద్రన్‌‌‌‌ దాఖలు చేసిన పిల్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భుయాన్, జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌.తుకారాంజీతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ బుధవారం విచారించింది. కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది. 40 ఏండ్లుగా 25 ఎకరాల స్థలంలో నివాసం ఉంటున్నారని, తగిన డ్రైనేజీ సౌకర్యంలేదని, మరుగుదొడ్లు కూడా లేవని పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ గాడి ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ వాదిస్తూ, సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌కి చెందిన భూమిని ఆక్రమించుకున్నారని, ఆక్రమణల్ని తొలగింపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, 40 ఏండ్లుగా నివాసం ఉంటున్న వాళ్లను ఒక్కసారిగా ఖాళీ చేయించడం సరికాదని, ఈ పిల్‌‌‌‌పై లోతుగా విచారణ చేస్తామని, అప్పటి వరకు ఖాళీ చేయించవద్దని సూచించింది.