హాల్ టికెట్‌‌ నంబర్‌‌, ఫొటో లేకుండా ..ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌ ఎట్లిస్తరు..

హాల్ టికెట్‌‌ నంబర్‌‌, ఫొటో లేకుండా ..ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌ ఎట్లిస్తరు..
  • గ్రూప్‌‌1 పరీక్షలో బయోమెట్రిక్‌‌ ఎందుకు అమలు చేయలేదు?
  • పరీక్షల నిర్వహణను ఖర్చు కోణంలో చూస్తారా?
  • ఎగ్జామ్స్‌‌ పెట్టేటప్పుడు ఖర్చులు ప్రామాణికం కాదని మీకు తెలియదా?
  • ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తే పరిస్థితేంటి?
  • టీఎస్‌‌పీఎస్సీకి హైకోర్టు ప్రశ్నల వర్షం
  • గ్రూప్‌‌1 ఎగ్జామ్‌‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌‌పై విచారణ

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్‌‌–1 ప్రిలిమ్స్‌‌ పరీక్ష నిర్వహించేటప్పుడు బయోమెట్రిక్‌‌ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ (టీఎస్‌‌పీఎస్సీ)ని హైకోర్టు ప్రశ్నించింది. ఓఎంఆర్‌‌ షీట్‌‌లో అభ్యర్థి హాల్‌‌ టికెట్‌‌ నంబర్‌‌‌‌, ఫొటో లేకుండా పరీక్ష ఎలా నిర్వహించారని నిలదీసింది. ఇటీవల జరిగిన గ్రూప్‌‌–1 ప్రిలిమ్స్‌‌ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఆదిలాబాద్‌‌ జిల్లాకు చెందిన బి.ప్రశాంత్‌‌ సహా ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌‌పై గురువారం జస్టిస్‌‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్‌‌‌‌ తీసుకోలేదని, ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌‌‌లో అభ్యర్థి హాల్‌‌‌‌ టికెట్‌‌‌‌ నంబర్‌‌‌‌ కూడా లేదని పిటిషనర్ల తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ గిరిధర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. ఇలాంటి ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌‌‌ ఎవరికి ఏది ఇచ్చారో గుర్తించడం కష్టమని, వాటిని తారుమారు చేసేందుకు వీలుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్‌‌‌‌1 ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదని, వెంటనే వాటిని రద్దు చేసి, తిరిగి నిర్వహించేలా టీఎస్‌‌‌‌పీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న వినతి పత్రం ఇస్తే సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

తప్పు జరిగే చాన్స్‌‌‌‌ లేదు: ప్రభుత్వ లాయర్‌‌‌‌‌‌‌‌

పరీక్షల్లో ఒకరి బదులు మరొకరు రాసే ఆస్కారం లేదని టీఎస్‌‌‌‌పీఎస్సీ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ ఎం.రాంగోపాల్‌‌‌‌రావు అన్నారు. ఇన్విజిలేటర్‌‌‌‌ వద్ద నామినల్‌‌‌‌ రోల్‌‌‌‌ ఉంటుందని, అందులో అభ్యర్థి ఫొటోతో పాటు హాల్‌‌‌‌ టికెట్‌‌‌‌ నంబర్‌‌‌‌ కూడా ఉంటుందని వివరించారు. వాటిపై అభ్యర్థుల సంతకాలు కూడా తీసుకున్నారని తెలిపారు. ఓఎంఆర్‌‌‌‌ షీట్‌‌‌‌ కూడా హాల్‌‌‌‌టికెట్‌‌‌‌ నంబర్, ప్రశ్నపత్రం కోడ్‌‌‌‌ నమోదు చేసే విధంగా పరీక్ష నిర్వహించామన్నారు. ఆధార్, ఓటర్‌‌‌‌‌‌‌‌ కార్డు వంటి అధికారిక గుర్తింపు కార్డులను పరిశీలించాకే అభ్యర్థులను పరీక్షకు అనుమతించినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కమిషన్‌‌‌‌కు విచక్షణాధికారాలు ఉంటాయని, వాటి ప్రకారమే ఎగ్జామ్‌‌‌‌ నిర్వహించామని తెలిపారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఈ విషయాన్ని తప్పుబట్టారని, పరీక్ష రాసిన మిగతా వారు ఎలాంటి అనుమానాలు లెవనెత్తలేదన్నారు. అంతేకాకుండా బయోమెట్రిక్‌‌‌‌ విధానాన్ని అమలు చేయాలంటే రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని తెలిపారు. గతంలో ఫొటోలతో ప్రింట్‌‌‌‌ చేస్తే 35 శాతం మందే గ్రూప్‌‌‌‌ 1కు హాజరయ్యారని చెప్పారు. వచ్చే గ్రూప్‌‌‌‌–4 పరీక్షలకు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, వీరందరికీ బయోమెట్రిక్‌‌‌‌ అంటే వ్యయం భారీగా అవుతుందని పేర్కొన్నారు.

హాల్‌‌ టికెట్‌‌ నంబర్‌‌‌‌, అభ్యర్థి ఫొటో లేకుండా ఓఎంఆర్‌‌ షీట్స్‌‌ను ఎలా జారీ చేశారు? పరీక్షకు ఒకరి బదులు మరొకరు హాజరవకుండా ఉండేందుకు కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఈ విషయం సర్వీస్‌‌ కమిషన్‌‌కు తెలియదా? గతేడాది అక్టోబర్‌‌లో పరీక్ష నిర్వహించినప్పుడు అమలు చేసిన విధానాన్ని ఇప్పుడెందుకు అమలు చేయలేదు? బయోమెట్రిక్‌‌ విధానం అమలుకు ఖర్చు ఎక్కువ అవుతుందని టీఎస్‌‌పీఎస్సీ ఎలా చెప్తుంది? పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఖర్చులను లెక్కిస్తారా? పరీక్షల నిర్వహణకు ఖర్చు ప్రామాణికం కానేకాదని మీకు తెలియదా?’’అని హైకోర్టు ప్రశ్నించింది.