అందరూ రిటైర్ అయ్యేదాకా ఏం చేశారు? : హైకోర్టు

అందరూ రిటైర్ అయ్యేదాకా ఏం చేశారు? : హైకోర్టు
  • పోస్టుల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోలే
  • సమాచార కమిషనర్ల నియామకంలో సర్కార్ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం
  • ఆర్టీఐ చట్టం కింద సమాచారం కావాలంటే 
  • ఏం చేయాలని అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ల నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చీఫ్​ కమిషనర్ 2020 ఆగస్టులో రిటైర్ అయ్యారని, ఆరుగురు కమిషనర్లలో చివరి కమిషనర్ ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారని గుర్తు చేసింది. వీరంతా రిటైరయ్యే వరకు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేయడానికి ముందే కొత్తవాళ్ల నియామకాలకు చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. అందరూ రిటైర్ అయ్యే వరకు ఏం చేశారని ప్రశ్నించింది. ఈనెల 4న నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశారని, ఆగస్టు 4వ తేదీ అప్లికేషన్లకు చివరి తేదీగా పేర్కొన్నారని తెలిపింది. ఈ మధ్య కాలంలో ఎవరైనా సమాచార హక్కు ద్వారా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల విషయంలోనూ ఇదే జరుగుతున్నదని మండిపడింది. 

సమాచార శాఖ చీఫ్ కమిషనర్, కమిషనర్లను నియమించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్​ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ సరసాని సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. 2020 నుంచి చీఫ్ కమిషనర్, కమిషనర్లు లేరని, మిగిలిన ఒక్క కమిషనర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారని చెప్పారు. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. నియామక ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈనెల 4న నోటిఫికేషన్ జారీ అయిందని కోర్టుకు వివరించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ఈ చర్యలు చేపట్టినప్పటికీ.. తాము ఏమాత్రం సంతోషంగా లేమని తెలిపింది. విచారణ ఆగస్టు 23కి వాయిదా వేసింది.