రిటైర్​మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలో లేటెందుకు : హైకోర్టు

రిటైర్​మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలో లేటెందుకు : హైకోర్టు
  •  హెచ్ఎం మృతిపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన తరువాత అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అందక ఒక హెచ్ఎం మనోవేదనతో మృతిచెందారని, ఆ పరిస్థితి ఎందుకు ఎదురైందన్నదానిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా ఏన్కూర్‌‌ మండలం జిల్లా ఉన్నత పరిషత్‌‌ బాలికల పాఠశాల హెచ్ఎంగా కూరపాటి పాండురంగయ్య పదవీ విరమణ చేసి ఏడాది అయినా రిటైర్​మెంట్​బెనిఫిట్స్ అందలేదు.

 ప్రభుత్వం నుంచి బకాయిల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వాటి కోసం ఎదరుచూస్తూ మనోవేదనతో మృతిచెందారని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణను స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌ యారా రేణుకతో కూడిన బెంచ్‌‌ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, విద్యాశాఖ కమిషనర్, అకౌంటెంట్ జనరల్‌‌ తదితరులకు 
నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్‌‌కు వాయిదా వేసింది.