గ్రూప్ 1 ప్రిలిమ్స్ యథాతదం.. పరీక్షను వాయిదా వేయలేమన్న హైకోర్టు

గ్రూప్ 1 ప్రిలిమ్స్ యథాతదం.. పరీక్షను వాయిదా వేయలేమన్న హైకోర్టు

 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్షను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది.  జూన్‌ 11న జరిగే  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో దాఖ‌లైన‌ రిట్‌ పిటిషన్‌పై విచార‌ణ జ‌రిగింది. గ్రూప్ 1 పరీక్షను రెండు నెలలు వాయిదా వేయాలని 36 మంది అభ్యర్థులు కోరారు.  గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే విధిస్తూ మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో అభ్యర్థులు కోర్టును కోరారు.  అయితే  తన కుమార్తె కూడా గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాసినందున తాను విచారించ‌లేన‌ని జ‌స్టిస్ కే ల‌క్ష్మణ్ తెలిపారు. ఈ  పిటిష‌న్‌ను  మ‌రో బెంచ్‌కు పంపిస్తాన‌ని ల‌క్ష్మణ్ వివ‌రించారు. మే25న మ‌ధ్యాహ్నం  ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్. .గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్షను వాయిదా వేసేందుకు నిరాక‌రించింది.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్ పై టీఎస్పీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. 36 మంది అభ్యర్థుల కోసం 3 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును పనంగా పెట్టలేమన్నారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను అమలు చేయకుండా  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం చట్టవిరుద్ధమని 36 మంది అభ్యర్థుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.  దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యద‌ర్శి, హోం శాఖ కార్యద‌ర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది.

2022  అక్టోబర్‌లో గ్రూప్‌ 1 పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది.  ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే  పేపర్ లీక్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఆ తర్వాత  జూన్ 11 న గ్రూప్ 1 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని  కోరుతూ 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.