అక్రమ నిర్బంధం కేసులో పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిందే..పోలీసులపై కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

అక్రమ నిర్బంధం కేసులో పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిందే..పోలీసులపై కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులపై నమోదైన కేసులను కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. అధికార దుర్వినియోగం, అక్రమ నిర్బంధం వంటి తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో వీటిని కింది కోర్టు విచారణలో ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. సోషల్‌‌‌‌ మీడియాలోని అంశాలపై కేసు నమోదు వ్యవహారంలో అక్రమంగా నిర్బంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ న్యాయవాది విజయ్‌‌‌‌ గోపాల్‌‌‌‌ ఫిర్యాదుతో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ రూపావత్‌‌‌‌ పవన్, నామిండ్ల శంకర్‌‌‌‌ అనే పోలీసు అధికారులు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు.

వీటిపై జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌.తుకారాంజీ విచారణ చేపట్టారు.పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. విధుల్లో భాగంగానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. బాధితుల తరఫు న్యాయవాది వాదిస్తూ..ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌  నమోదుకుముందు కొన్ని గంటలపాటు అక్రమంగా నిర్బంధించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పోలీసులపై ఆరోపణలు రుజువైతే ఇలాంటి కేసును విచారణకు స్వీకరించవచ్చని చెప్పారు. అక్రమ నిర్బంధం, బెదిరించడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచకపోవడం తదితరాలన్నీ కోర్టు విచారణలో తేలాల్సి ఉందన్నారు. అందువల్ల ప్రాథమిక దశలో కేసు ఉన్నప్పుడు రద్దు చేయలేమంటూ పోలీసుల పిటిషన్‌‌‌‌ను కొట్టివేశారు.