ఓటుకు నోటు కేసులో రేవంత్‌‌ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఓటుకు నోటు కేసులో రేవంత్‌‌ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
  • ఓటుకు నోటు కేసు రేవంత్‌‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్, వెలుగు: ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్‌‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల షెడ్యూల్‌‌ అమలులో ఉండగా ఓటరుకు డబ్బులిచ్చారనే అభియోగాలు అవినీతి నిరోధక చట్టం కిందకు రావని, ఎన్నికల కేసు అవుతుందని రేవంత్‌‌ రెడ్డి ఫైల్‌‌ చేసిన క్రిమినల్‌‌ రివిజన్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌‌ సన్‌‌కు సొమ్ములు ఇస్తూ రేవంత్‌‌ పట్టుబడ్డారని ఏసీబీ కేసు ఫైల్‌‌ చేసింది. ఘటనా స్థలంలో రూ.50 లక్షలు దొరికినట్లుగా పేర్కొంది. రేవంత్‌‌రెడ్డి వాదనను ఏసీబీ కోర్టు కొట్టేడయంతో ఆయన హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. ఈ పిటిషన్‌‌ను కొట్టేస్తూ  జస్టిస్‌‌ లక్ష్మణ్‌‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఏసీబీ కోర్టులోనే విచారణ చేయాలని, ఇప్పటికే ఏ2, ఏ3, ఏ4ల డిశ్చార్జి పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసిందని, హైకోర్టు కూడా వాటిని సమర్థించిందని ఏసీబీ లాయర్‌‌‌‌ వాదనలు వినిపించారు. ఐపీసీ  సెక్షన్‌‌ 171బి కింద ఎలక్షన్‌‌ కేసు అవుతుందని, ఐపీసీలోని 171ఇ కింద శిక్షార్హులు అవుతారేగానీ ఏసీబీ చట్టాల కింద కేసు నమోదు చెల్లదని రేవంత్‌‌ వేసిన పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది.