కోణార్క్ థియేటర్‌‌కు మాత్రమే పార్కింగ్‌‌ ఫీజు రద్దు : హైకోర్టు

కోణార్క్ థియేటర్‌‌కు మాత్రమే పార్కింగ్‌‌ ఫీజు రద్దు : హైకోర్టు
  •     సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన  హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్‌‌ ఏరియాల్లోని సింగిల్‌‌ స్క్రీన్‌‌ థియేటర్లలో పార్కింగ్‌‌ ఫీజును వసూలు చేయరాదంటూ సింగిల్‌‌ జడ్జి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులు కేవలం దిల్‌‌షుక్‌‌నగర్‌‌లోని కోణార్క్‌‌ థియేటర్‌‌కే వర్తిస్తాయని తేల్చిచెప్పింది. పార్కింగ్‌‌ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి సింగిల్‌‌ స్క్రీన్‌‌ థియేటర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 121ను సవాలు చేస్తూ రామావత్‌‌ ప్రేమ్‌‌కుమార్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌‌ జడ్జి జీవోపై స్టే ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్‌‌ స్క్రీన్‌‌ థియేటర్లలో పార్కింగ్‌‌ ఫీజు వసూలు చేయరాదంటూ ఆదేశాలు చేశారు.

దీన్ని సవాల్ చేస్తూ సుదర్శన్‌‌ 35ఎంఎం, ఆర్‌‌ఆర్‌‌ సినీ ఎంటర్‌‌ప్రైజస్‌‌ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌లతో కూడిన బెంచ్‌‌ బుధవారం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులను ఒక థియేటర్‌‌కే పరిమితం చేస్తూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది.