మొదటి రిజిస్ట్రేషన్‌‌ రద్దు కాకుండా రెండోది చెల్లదు : హైకోర్టు

మొదటి రిజిస్ట్రేషన్‌‌ రద్దు కాకుండా రెండోది చెల్లదు : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: స్తిరాస్థుల మొదటి రిజిస్ట్రేషన్‌‌ రద్దు కాకుండా రెండోది చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక రిజిస్ట్రేషన్‌‌ ఉనికిలో ఉండగా.. ఇంకో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో  గోపు నాగమణి అనే మహిళ తండ్రి 1983లో 500 చదరపు గజాల ప్లాటు కొన్నారు.  అక్కడ నాగమణి ఇంటి  నిర్మాణాన్ని చేపట్టింది. పవర్ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

కాగా..ఆ ప్లాటులో తమకూ హక్కులున్నాయని జైహింద్‌‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఇంప్లిడ్‌‌ పిటిషన్‌‌ వేశారు. నాగమణి తండ్రి మాదిరిగా శంకర్‌‌ హిల్స్‌‌ లే అవుట్ లో  జాగాలు కొన్న 15 మందిలో 13 మంది 1997లో  తనకు ప్లాట్లు అమ్మారని పేరొన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌‌ నగేశ్ భీమపాక విచారణ జరిపారు. 1983లో ప్లాటు కొనుగోలు చేసిన వారి విక్రయ ఒప్పందాన్ని అధికారులు రద్దు చేయలేదని కోర్టు తెలిపింది.

అలాంటప్పుడు ఆ ప్లాట్లను1997లో ఎలా రిజిస్టర్ చేశారని నిలదీసింది. ఈ కేసులో జైహింద్‌‌ రెడ్డిని ప్రతివాదిగా పరిగణించలేమని వెల్లడించింది. అనవసరంగా కోర్టు సమయం వృథా చేసినందుకు జైహింద్‌‌రెడ్డికివెయ్యి జరిమానావిధించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు లీగల్‌‌ సర్వీసెస్‌‌ కమిటీకి చెల్లించాలని ఆదేశించింది. నాగమణి ఇంటికి విద్యుత్‌‌ కనెక్షన్‌‌ ఇవ్వాలని విద్యుత్‌‌ శాఖకు స్పష్టం చేసింది.