హైదరాబాద్, వెలుగు: ‘న్యాయం, మోసం.. కలిసి మనుగడ సాగించలేవు. తప్పుడు పత్రాలతో హక్కులు పొందలేరు. మోసపూరిత మ్యుటేషన్లు చట్టబద్ధం కావు. రిజిస్ట్రేషన్ పత్రాలపై ఉన్న సత్యమేయ జయతే నినాదమే తప్పుడు పత్రాలతో భూమి కాజేశారని పట్టిచ్చింది.’ అని హైకోర్టు పేర్కొంది. తప్పుడు పత్రాలతో గిరిజనుడి పేరిట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 14.09 ఎకరాల భూమిపై హక్కులు పొందడం, ప్లాట్లుగా విక్రయించడం వంచన కిందకే వస్తుందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని భూ వివాదంపై ఇటీవల తీర్పు వెల్లడించింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయకుండా.. 1970లో చట్టం అమల్లోకి రాకముందే 1959లో 14.09 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ కర్రి కోటేశ్వరరావు 2013లో హైకోర్టును ఆశ్రయించారు. ఆయన మృతిచెందాక.. భార్య, ఆమె మరణానంతరం వారసులుగా సోదరుడు, మేనల్లుడు కేసును కొనసాగించారు. ఈ భూమిపై మాలోతు శ్రీను 1973 నాటి కొనుగోలు పత్రాన్ని చూపిస్తూ హక్కులు పొందారు. తప్పుడు పత్రాలతో హక్కులు కోరుతూ శ్రీను దాఖలు చేసిన పిటిషన్ పై ఐటీడీఏ అధికారి ఏజెంట్ హోదాలో 2011లో జారీ చేసిన ఉత్తర్వులు, వాటిని సమర్థిస్తూ ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో 13ను కోటేశ్వరరావు హైకోర్టులో సవాల్ చేశారు.
స్టాంప్ పేపర్ నకిలీదని గుర్తించిన కోర్టు
ప్రతివాది సమర్పించిన 1973 నాటి స్టాంప్ పేపర్ నకిలీదని కోర్టు గుర్తించింది. దానిపై సత్యమేవ జయతేతో పాటు అశోక చక్రం ఉండగా, అలాంటి ముద్రణ 1977 తర్వాతే ప్రారంభమైందని పేర్కొంది. కలెక్టర్ 2024లో సమర్పించిన నివేదిక ప్రకారం.. వివాదాస్పద భూమిలో 130 మంది గిరిజనులు ప్లాట్లు కొనుగోలు చేశారు. భూమి కోర్టు వివాదంలో ఉందని పిటిషనర్లు హెచ్చరించినప్పటికీ కొనుగోళ్లు సాగాయని కోర్టు గుర్తించింది. కొనుగోలుదారులు వారు చెల్లించిన సొమ్మును మాలోతు శ్రీను నుంచి రాబట్టుకోవచ్చని సూచించింది. అక్రమ నిర్మాణాలు, అనధికార లావాదేవీలపై చర్యలు తీసుకోవాలని, పిటిషనర్ల పేర్లను తిరిగి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. శ్రీనుపై పిటిషనర్లు సివిల్, క్రిమినల్ చర్యలు కూడా చేపట్టవచ్చని పేర్కొంది.
