బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ ..తొలగింపుపై హైకోర్టు స్టే

బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ ..తొలగింపుపై హైకోర్టు స్టే
  • ప్రభుత్వం ఏకపక్షంగా జీవో ఇచ్చిందన్న కోర్టు
  • రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు

హైదరాబాద్, వెలుగు :  బోయిన్​పల్లి వ్యవసాయ మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ రాగేరి హారికకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఆమెను చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ పదవి నుంచి తొలగించిందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం అకస్మాత్తుగా ఎటువంటి నోటీసు జారీ లేదా నిర్ధిష్టమైన కారణం లేకుండా ఆమెను పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల 8న జీవో 483ను జారీ చేయడాన్ని  హైకోర్టు తప్పుపట్టింది. జీవో అమలును నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

 చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా పిటిషనర్‌‌‌‌ను నియమిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆమెకు ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, సంజాయిషీ కోరకుండా ఏకపక్షంగా పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసిందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు జీవోను సస్పెండ్‌‌‌‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  రెండు వారాల్లోగా కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.