
హైదరాబాద్, వెలుగు: లోన్ యాప్ కంపెనీలకు చెందిన సీజ్ చేసిన నగదులో మానవీయ కోణంలో ఆలోచించి కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. క్రిమినల్ కేసుల్లో మానవీయతతో ఉత్తర్వులు జారీ చేసేందుకు చట్టంలో ఆస్కారం లేదని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేసింది. లోన్ల పేరుతో జనాలను అట్రాక్ట్ చేసి వారి నుంచి అధిక వడ్డీలు వసూలు చేసి దోచుకునే లోన్ యాప్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వీటిపై విచారణ చేపట్టిన ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చైనా సంస్థల పర్యవేక్షణలో పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరో మూడు లోన్ యాప్ సంస్థలకు చెందిన రూ.288 కోట్లను సీజ్ చేసింది. దీంతో తమ సంస్థల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయా కంపెనీలు గతంలో హైకోర్టును ఆశ్రయించాయి. సీజ్ చేసిన సొమ్ము నుంచి రూ.15.5 కోట్లను మానవీయ కోణంలో విడుదల చేయాలని ఈడీని సింగిల్ జడ్జి ఆదేశించారు.