హైకోర్టు ఆగ్రహం.. సర్కార్ నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న కరోనా కేసులు

V6 Velugu Posted on Apr 27, 2021

  • వచ్చే వాయిదాలో ఎన్నికల కమిషనర్‌ హాజరుకావాలన్న కోర్టు
  • తెలంగాణలో కూడా లాక్‌డౌన్ పెట్టాలన్న పిటిషనర్లు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే.. కోవిడ్ హాస్పిటల్స్ సంఖ్య ఎందుకు పెంచడం లేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అందుకే ప్రజలు కార్పొరెట్ హాస్పిటల్స్‌కు వెళ్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అంబులెన్స్ ఆపరేటర్ల అక్రమాలకు ఎందుకు చెక్ పెట్టడం లేదని హైకోర్టు మండిపడింది. జీహెచ్ఎంసీలో కరోనా మరణాలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం అలసత్వం వల్లనే  కరోనా కేసులు 10 వేలు దాటాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు పెరుగుతుంటే.. స్కూళ్లు, కాలేజీలు, గ్రౌండ్లను ఎందుకు కరోనా సెంటర్లుగా మార్చుకోవడంలేదని కోర్టు ప్రశ్నించింది.

తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు‌లో కరోనా కేసులు పెరగడానికి ఈసీ నిర్లక్ష్యమే కారణమని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అందువల్ల ఎన్నికల కమిషనర్‌ను కూడా ఈ కేసులో చేర్చాలని పిటిషనర్లు కోర్టును కోరారు.  ఇతర రాష్ట్రాలలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో కూడా లాక్‌డౌన్ పెట్టె విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. దాంతో ఎన్నికల ప్రధాన అధికారిని వచ్చే విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు అదేశించింది. గతంలో హితమ్ యాప్‌ను అందుబాటులోకి 
తీసుకొస్తామని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు తీసుకురాకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
 

‘ప్రభుత్వం చెప్తున్నది ఒకటి.. చేసేది మరొకటి. మాక్రో కంటేయిన్మేంట్ జోన్లలో నైట్ కర్ఫ్వూ మాత్రమే కాకుండా సాంఘీక సమావేశాలను మరియు అన్ని గ్యాదరింగులను 50%నికి కుదించాలి. శవాలను తరలించే బ్యాగులను ఎక్కువ సంఖ్యలో సిద్ధం చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ  RTPCR టెస్టులకోసం వేచిచూడకుండా వైద్యం అందించాలి. కరోనా పరిస్థితిపై ప్రభుత్వం సరైన అఫిడవిట్‌ను ఫైల్ చేయాలి. ఆక్సిజన్ రవాణాకు భారత వాయిసేన వాయు మార్గాలను సిద్ధంగా ఉంచాలి. కేంద్రం కూడా రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూడాలి. రాష్ట్రానికి చేసే ఆక్సిజన్ సరఫరాను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ ఫైల్ చేయాలి. లైఫ్ సేవింగ్ డ్రగ్ సరఫరా కూడా కొరత లేకుండా చేయాలి. వృద్ధులకు, వికలాంగులకు వైద్యసదుపాయం సరైన విధంగా అందేలా చూడాలి. నైట్ షెల్టర్లలో సరైన సౌకర్యాలను కల్పించాలి. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా కోవిడ్ సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డైలీ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి. 2,094  కోవిడ్ మరణాల వివరాలను వెబ్ పోర్టల్‌‌లో ఉంచాలి. హితమ్ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలి. బార్లు, వైన్స్‌లు, పబ్‌ల వద్ద ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేయాలి. 108,104 అంబులెన్స్‌లు ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఉంచాలి. కరోనా కోసం మరిన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. శవాలను తరలించడానికి గుర్రాలను వాడితే బెటర్. పోలీస్ శాఖ సమర్పించిన నివేదిక అసంతృప్తిగా ఉంది. యావత్ రాష్ట్రంలో కేవలం నాలుగే సోషల్ డిస్టెన్స్ కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలి. కోర్టు ఇచ్చిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నాం. త్వరలో మరో పూర్తి నివేదిక సమర్పించాలి’ అని ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Tagged Telangana, lockdown, election commissioner, coronavirus, corona cases, Telangana High Court, corona spread,

Latest Videos

Subscribe Now

More News