వీర జవాన్ కుటుంబానికి 12 ఏండ్లయినా జాగ ఇయ్యరా?

వీర జవాన్ కుటుంబానికి 12 ఏండ్లయినా జాగ ఇయ్యరా?

హైదరాబాద్, వెలుగు: దేశం కోసం ప్రాణాలర్పించిన కీర్తి చక్ర అవార్డు గ్రహీత భార్యకు ఇంటి జాగ ఇచ్చేందుకు ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి స్థలం ఇస్తామని జీవో ఇచ్చి 12 ఏండ్లు అయిందని, ఇప్పుడు మళ్లీ 3 నెలలు టైమ్‌‌ కావాలని కోరడమేంటని నిలదీసింది. 3 నెలలు కాదని, 3 వారాల్లోనే వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని తేల్చి చెప్పింది. ఆప్ఘానిస్థాన్‌‌ రాజధాని కాబూల్‌‌లో ఇండియన్‌‌ ఎంబసీపై 2008లో తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో మృతి చెందిన ఐఎఫ్‌‌ఎస్‌‌ అధికారి వాడపల్లి వెంకటేశ్వరరావు కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 2014లో జీవో జారీ అయింది. హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌‌ భరణి లే ఔట్‌‌లో 475 గజాల స్థలం ఇస్తామని జీవోలో సర్కారు పేర్కొంది. ఏండ్లు గడుస్తున్నా స్థలం ఇవ్వడం లేదని వెంకటేశ్వరరావు భార్య మాలతీరావు హైకోర్టుకు రాసిన లేఖను రిట్‌‌ పిటిషన్‌‌గా తీసుకొని కోర్టు విచారించింది. వీరుడి కుటుంబాన్ని ఆఫీసుల చుట్ట తిప్పుకోకూడదన్న కోర్టు..  ఆగస్టు 23న జరిగే విచారణ నాటికి బాధితురాలికి ఇంటి స్థలం పట్టా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.