
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ నుంచి రైతుల పేర్లను ఇష్టం వచ్చినట్లుగా అధికారులు తొలగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరణి పోర్టల్ నుంచి ఏ రైతు పేరునైనా తొలగించాలంటే ఒక విధానం ఉందని, వాటిని అమలు చేయాల్సిందేనని స్పష్టంచేసింది. రైతుబంధు ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని మిగుల్చుకోవడానికే ధరణి పోర్టల్ నుంచి రైతుల పేర్లు తొలగించారనే భావన రాకూడదని కామెంట్ చేసింది. కామారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన భూపల్లి సాయిలు, మరో 75 మంది ఎస్టీ రైతుల పేర్లను ధరణి నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. నివేదిక ఇవ్వకుంటే ఈ నెల 15న జరిగే విచారణకు కలెక్టర్‌తోపాటు కామారెడ్డి ఆర్డీవో కూడా హాజరుకావాలని ఆదేశాలిచ్చింది.