అద్దె బస్సుల టెండర్లపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు సింగిల్​ జడ్జి

అద్దె బస్సుల టెండర్లపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు సింగిల్​ జడ్జి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్ల విషయంలో కలగజేసుకోలేమని హైకోర్టు సింగిల్​ జడ్జి చెప్పారు. పెద్ద సంఖ్యలో బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న  ప్రయత్నాన్ని అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్​పై జస్టిస్​ రాజశేఖర్​ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రమేశ్​ కుమార్​ దాఖలు చేసిన పిటిషన్​పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

తాత్కాలిక పద్ధతిలో ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుంటే తమకు అభ్యంతరంలేదని పిటిషనర్​ తరఫు లాయర్​ సూర్యకరణ్​ రెడ్డి వాదించారు. శాశ్వత ప్రాతిపదికపై, పెద్ద మొత్తంలో అద్దెకు తీసుకోవడానికి టెండర్లు పిలవడం సరికాదన్నారు. ఆర్టీసీకి బోర్డు లేదని కోర్టుకు గుర్తుచేస్తూ, తాత్కాలిక ఎండీ టెండర్లు పిలవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. టెండర్​ ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వం తరఫున అడిషనల్​ అడ్వొకేట్​ జనరల్​ రామచందర్​ రావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ చట్టంలోని 34వ సెక్షన్​ ప్రకారం ప్రభుత్వమే టెండర్లు పిలవాలని ఆర్టీసీని ఆదేశించిందన్నారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఒకపక్క సమ్మె చేస్తూ.. మరోపక్క అద్దె బస్సుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం తగదన్నారు. ఆర్టీసీ చట్ట ప్రకారం కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించినట్లు తెలిపారు. రిట్‌‌‌‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరారు. వాదన పూర్తయ్యాక.. రిట్​ను ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ఇతర రిట్లతో కలిపి సీజే అధ్యక్షతన కల డివిజన్​ బెంచ్​ ముందు ఉంచాలని జస్టిస్​ రాజశేఖర్​ రెడ్డి ఆదేశించారు. బస్సులను తాత్కాలిక పద్ధతిలోనే అద్దెకు తీసుకోవాలంటూ ఆదేశాలివ్వాలని పిటిషనర్​ లాయర్​ కోరగా.. ఈ విషయాన్ని డివిజన్​ బెంచ్​ ఎదుట చెప్పుకోవాలని జడ్జి సూచించారు.