నోటీసులిచ్చి అక్రమ నిర్మాణాలను సీజ్‌‌ చేయండి

నోటీసులిచ్చి అక్రమ నిర్మాణాలను సీజ్‌‌ చేయండి
  • జీహెచ్‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హెచ్‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశంహైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జీహెచ్‌‌ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులను ఉల్లంఘించి చేపట్టిన అక్రమ నిర్మాణాలకు షోకాజ్‌‌ నోటీసుతోపాటు తక్షణం సీజ్‌‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబా ద్‌‌ షేక్‌‌పేటలో ఓయూ కాలనీలో ఒక వ్యక్తి జీ ప్లస్‌‌ 2 అనుమతులు తీసుకుని 3, 4, 5 అంతస్తులు, ఆపైన పెంట్‌‌ హౌస్‌‌ నిర్మాణం చేపడుతున్నారంటూ అందిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జి.రమేశ్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారణ చేపట్టి జీహెచ్‌‌ఎంసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

షోకాజ్‌‌ నోటీసు జారీ చేసిన వెంటనే జీహెచ్‌‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌‌ 461ఎ కింద ఎందుకు సీజ్‌‌ చేయడంలేదో అర్థం కావడంలేదన్నారు. నోటీసు జారీ చేసిన తరువాత చట్టం పట్ల ఏ మాత్రం భయం లేకుండా, కూల్చివేతలపై ఎలాంటి ఆందోళన లేకుండా నిర్మాణానాలను కొనసాగిస్తున్నారన్నారు. ఇందులో యజమానులు/బిల్డర్లు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల మధ్య సంబంధం లేదని చెప్పలేమన్నారు. ఇకపై అనధికారిక నిర్మాణాలు జరిగినట్లు గుర్తించిన వెంటనే షోకాజ్‌‌ నోటీసు జారీ చేయడంతోపాటు అక్రమ నిర్మాణాలకు తక్షణం సీల్‌‌ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌‌ సిటీ ప్లానర్స్, టౌన్‌‌ప్లానింగ్‌‌ అధికారులకు తగిన సూచనలు జారీచేయాలని జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌కు ఆదేశించింది.