ధరణితో సర్టిఫైడ్‌‌ కాపీలు ఎందుకిస్తలేరు ?

ధరణితో సర్టిఫైడ్‌‌ కాపీలు ఎందుకిస్తలేరు ?
  • సీసీఎల్‌‌ఏను వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ‘ధరణి’తో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై మంగళవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని చీఫ్‌‌ కమిషనర్‌‌ ఆఫ్‌‌ ల్యాండ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌(సీసీఎల్‌‌ఏ)ను హైకోర్టు ఆదేశించింది. ధరణి పోర్టల్‌‌లో నమోదైన సేల్‌‌ డీడ్‌‌ల సర్టిఫైడ్‌‌ కాపీలను జారీ చేయడం లేదని దాఖలైన కేసుల్లో కౌంటర్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేయకపోవడంతో ఈ ఉత్తర్వులిచ్చింది. పలుసార్లు విచారణ జరిగినా ప్రభుత్వం కౌంటర్‌‌ వేయకుండా కాలయాపన చేయడంపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్టిఫైడ్‌‌ కాపీలను ఎందుకు జారీ చేయడం లేదో తెలియజేయాలని ప్రశ్నించారు.

సర్టిఫైడ్‌‌ కాపీలు ఇవ్వకుండా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ కోర్టుకు చెప్పారు. స్కానింగ్‌‌ చేసిన కాపీలు ధరణి పోర్టల్‌‌లో ఉంటాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. కొన్ని సమస్యలను వారంలో.. మరికొన్నింటిని 45 రోజుల్లో పరిష్కరించాలని నిబంధనల్లో ఉన్నా ఎందుకు అమలు చేయలేదని న్యాయమూర్తి అడిగారు. ఎలాంటి కారణం తెలపకుండా సర్టిఫైడ్‌‌ కాపీలు కోరిన వారికి నిరాకరిస్తూ మెసేజ్‌‌ పంపడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమస్యలపై మంగళవారం జరగనున్న విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని సీసీఎల్‌‌ఏకు కోర్టు స్పష్టం చేసింది.