స్థానిక ఆశలు ఆవిరి!.. ఉదయం నామినేషన్లు.. సాయంత్రానికి హైకోర్టు స్టే

స్థానిక ఆశలు ఆవిరి!.. ఉదయం నామినేషన్లు.. సాయంత్రానికి హైకోర్టు స్టే
  • ఎన్నికల ప్రక్రియకు బ్రేక్​తో నిరుత్సాహంలో ఆశావహులు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల సందడికి  బ్రేక్​ పండింది. గురువారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల నామినేషన్ల సందడి కొనసాగగా, సాయంత్రానికి హైకోర్టు స్టే విధించడంతో అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. శుక్ర, శనివారాల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు. 

మారిన పొలిటికల్ ​సీన్..

స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో భాగంగా గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్​ను ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు రిలీజ్​చేశారు. నామినేషన్ల పర్వం మొదలైంది. గురు, శుక్ర, శనివారాల్లో నామినేషన్ల ఘట్టం కొనసాగాల్సి ఉంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో 10 జడ్పీటీసీ స్థానాలకు గాను తొలి రోజున రెండు, 149ఎంపీటీసీ స్థానాలకు గానూ ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 11 జడ్పీటీసీలకు ఒక్క నామినేషన్​ కూడా రాలేదు. 113 ఎంపీటీసీలకు గానూ 17 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమయ్యారు. అంతలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంతో గురువారం సాయంత్రానికి జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆశావహుల్లో ఆందోళన, నిరాశ కనిపించింది.

 గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్​ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్​ పదవులకు ఎప్పుడూ లేని విధంగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో భవిష్యత్​లో బీసీలకు ఇప్పుడున్న విధంగా రిజర్వేషన్లు ఉంటాయా అనే ఆందోళన ఆశవాహుల్లో నెలకొంది. 

మళ్లీ ఎప్పుడో..?

స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోననే టెన్షన్​ నెలకొంది. అప్పటి వరకు ఇప్పుడు ఉన్న రాజకీయాలు ఎలా మారుతాయోననే ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆఫీసర్లతో పాటు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలకు అంతా సన్నద్ధమయ్యారు. మండలాలకు నోడల్​ ఆఫీసర్లను నియమించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్​లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆశావహులు టికెట్ల కోసం ఎమ్మెల్యేలతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ తిరిగారు. 

లాబీయింగ్​ చేసుకున్నారు. టికెట్లు తమకే వస్తాయని ఆశిస్తున్న టైంలో ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో అటు ఆఫీసర్లతో పాటు ఇటు ఆశావహులు, పొలిటికల్​ లీడర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రస్తుతం దాఖలు చేసిన నామినేషన్లు ఉంటాయా, తిరిగి నామినేషన్లు వేయాల్సి ఉంటుందా అనే మీ మాంస అధికారులతో పాటు ఆశావహుల్లో నెలకొంది. 

అధికారులతో క్రిష్ణ ఆదిత్య సమావేశం

 స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టేకు ముందు గురువారం ఖమ్మం జిల్లాలో ఎన్నికల నిర్వహణపై స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు క్రిష్ణ ఆదిత్య అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టితోపాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, జడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, ఆర్టీఓ వెంకట రమణ, సీపీఓ ఏ. శ్రీనివాస్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, డీవైఎస్ఓ. సునీల్ రెడ్డి, డీసీఓ గంగాధర్, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి జి. పుల్లయ్య పాల్గొన్నారు.