రోగుల్ని పీల్చి పిప్పి చేస్తుంటే జీవో ఇవ్వడానికి కష్టమేంది?

రోగుల్ని పీల్చి పిప్పి చేస్తుంటే జీవో ఇవ్వడానికి కష్టమేంది?
  •     కరోనా ఫీజుల గరిష్ట ధరలు ఎందుకు నిర్ణయించట్లేదు
  •     రెండు వారాల్లో ఫీజులపై జీవో జారీ చేయాలి
  •     ఆలస్యం చేయడమంటే దోపిడీకి డోర్లు తీసినట్లే
  •     ఆరోగ్య శాఖలో 30 వేల ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తరు
  •     ప్రజారోగ్యంతో ఆటలాడుతామంటే ఎట్ల?
  •     రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: అధిక ఫీజులతో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగుల్ని పీల్చి పిప్పి చేస్తుంటే కట్టడి చేసేందుకు చార్జీలను నిర్ణయిస్తూ జీవో ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్​కు ఉన్న కష్టమేంటని హైకోర్టు నిలదీసింది. కరోనా చికిత్స బిల్లులకు గరిష్ట ధరలు నిర్ణయించాలని చెప్తే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. అట్లనే కరోనా చికిత్సలో వాడే లైఫ్‌‌‌‌ సేవింగ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ను అత్యవసర మందుల జాబితాలో ఎందుకు చేర్చడం లేదని కేంద్రాన్ని కూడా ప్రశ్నించింది. ప్రజల ఆరోగ్యమంటే ఏమనుకుంటున్నారని, వారి జీవితాతో చెలగాటం ఆడితే ఎట్లని నిప్పులు చెరిగింది. కరోనాపై దాఖలైన పిల్స్‌‌‌‌ను బుధవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌‌‌ విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది. నాలుగు వారాల సమయం ఇస్తే జీవో ఇస్తామని సర్కార్ చెప్పడాన్ని తప్పుపట్టింది. కార్పొరేట్‌‌‌‌ ఆస్పత్రులు రోగుల్ని ఫీజుల పేరుతో పిండేస్తుంటే ప్రభుత్వానికి కనబడటం లేదా? పిప్పి చేస్తుంటే కూడా తెలియడం లేదా? ఆలస్యం చేయడం అంటే దోపిడీకి ద్వారాలు తెరిచినట్లే కదా?  రెండు వారాల్లోగా గరిష్ట చార్జిల జీవో జారీ చేసి ఈ నెల 23న జరిగే విచారణలో సమర్పించాలని ఆదేశించింది. కరోనా చికిత్సలో వాడే లైఫ్‌‌‌‌ సేవింగ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ను అత్యవసర మందుల జాబితాలో చేర్చుతున్నదీ లేనిదీ చెప్పకుండా కేంద్రం అరకొర వివరాలతో నివేదిక ఇస్తే కుదరదని, వచ్చే విచారణ సమయంలో సూటిగా విషయాన్ని చెబుతూ అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా మందుల ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల్ని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనల్‌‌‌‌ ఫార్మాసూటికల్‌‌‌‌ ప్రైసింగ్‌‌‌‌ అథారిటీ(ఎన్‌‌‌‌పీపీఏ) డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌ దాఖలు చేసిన రిపోర్టుపై మండిపడింది.

ఆ టీచర్ల వివరాలు ఎందుకివ్వట్లేదు

ఎన్నికల డ్యూటీలో పాల్గొనడం వల్ల కరోనాతో మరణించిన టీచర్ల కుటుంబాలను ఏవిధంగా ఆదుకున్నది చెప్పలేదని ఆక్షేపించింది. అలాంటి టీచర్లను ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ వారియర్స్‌‌‌‌గా గుర్తించింది.. లేనిది చెప్పాలంది. ‘కమ్యూనిటీ కిచెన్‌‌‌‌లను ఏర్పాటు చేసి పేదలకు, నిరాశ్రయులకు ఉచితంగా భోజనం పెట్టాలంటే అమలు చేయలేదు. సంచార వాహనాల ద్వారా వ్యాక్సిన్‌‌‌‌ ఇస్తున్నది లేనిది చెప్పలేదు. వాకిన్‌‌‌‌, డ్రైవిన్ తరహాలో వ్యాక్సిన్‌‌‌‌ కేంద్రాలను అనేక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆదేశాలు అమలు చేయలేదు. గవర్నమెంట్‌‌‌‌ ఆస్పత్రులోల ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌‌‌‌ స్టాఫ్, కాంట్రాక్ట్‌‌‌‌/ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ 6,ఈ154 పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో 30 వేలకుపైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారు?. వృద్దులు, వికలాంగులు, అనాథలు, ఇతర నిరాశ్రయులకు వ్యాక్సిన్‌‌‌‌ ఇవ్వడానికి తీసుకునే చర్యలు ఏమిటి? .. అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది.

మూడో వేవ్​ కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నం

హైకోర్టు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ విచారణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ శ్రీనివాసరావులు హాజరయ్యారు.  మూడో దశ కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అయిదు వేల బెడ్స్‌‌‌‌ను పిల్లలకు కేటాయించామని  ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ చెప్పారు. అన్నీ బాగానే ఉన్నాయని, ఈ విషయాలను అఫిడవిట్‌‌‌‌ ద్వారా చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. జాతీయ ఆహార భద్రతలో భాగంగా బియ్యం కేటాయింపులకు రూ.91.94 కోట్లు అదనంగా వెచ్చించామని, బీపీఎల్‌‌‌‌ కింద 279.27 లక్షల మంది ప్రయోజనం పొందారని ఏజీ చెప్పారు. 14 ఆర్టీపీసీఆర్‌‌‌‌ సెంటర్స్‌‌‌‌కుగాను ఎనిమిది ప్రారంభం అయ్యాయని, మిగిలినవి గురువారం వినియోగంలోకి వస్తాయన్నారు.  విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది.

రఘుపై ఉన్న కేసుల వివరాలివ్వండి

జర్నలిస్టు రఘుపై ఉన్న కేసుల వివరాలు అందజేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్‌‌‌‌ చేశారని, కింది కోర్టులో బెయిల్‌‌‌‌ రాకుండా ఉండేందుకు ప్రభుత్వం రఘుపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వడం లేదని ఆయన భార్య గంజి లక్ష్మి ప్రవీణ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. డీజీపీకి వినతిపత్రం ఇస్తే కేసుల వివరాలు లభిస్తాయని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు బుధవారం తప్పుపట్టింది. రఘు భార్య  దాఖలు చేసిన రిట్‌‌‌‌ను వినతిపత్రంగా పరిగణించి కేసుల వివరాలను ఈ నెల 16లోగా ఇవ్వాలని డీజీపీని న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ ఆదేశించారు. విచారణ ఈ నెల 16కి కోర్టు వాయిదా వేసింది.

వానలు పడుతున్నా జొన్నలు కొనేందుకు జీవో ఇవ్వరా?

జొన్నల సేకరణకు జీవో జారీ చేయడంలో సర్కారు ఆలస్యం చేయడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వర్షాలు పడటం వల్ల పంట తడిసిపోతుంటే.. జీవో ఇంకో రెండు మూడు రోజుల్లో ఇస్తామని చెప్పడంపై సీరియస్ అయింది. వెంటనే జీవో జారీ చేసేందుకు ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో జొన్నల సేకరణ చేయకపోవడాన్ని తప్పుపడుతూ సామాజిక కార్యకర్త బొర్రన్న దాఖలు చేసిన పిల్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ బుధవారం విచారించింది. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో 4.5 లక్షల క్వింటాళ్ల జొన్నల సాగు జరిగిందని, మద్దతు ధర రూ.2,620గా ప్రకటించినా.. రూ.900 నుంచి రూ.1,200 లోపే కొంటున్నారని పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌‌‌‌ చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌‌‌‌ పరిషద్‌‌‌‌ స్పందిస్తూ.. జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుందని చెప్పారు. దీంతో  విచారణ ఈ నెల 14కి వాయిదా పడింది.

ప్రజాసంఘాల్ని ఎందుకు రద్దు చేసిన్రు?

రాష్ట్రంలోని 16 ప్రజా సంఘాలను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో సంఘాలపై నిషేధం విధించడాన్ని సవాల్‌‌‌‌ చేసిన కేసులో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గత మార్చి 30న సర్కారు జారీ చేసిన జీవో 73ను అమరుల బంధుమిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. దీన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ టి.అమర్‌‌‌‌నాథ్‌‌‌‌గౌడ్‌‌‌‌ విచారించారు. తెలంగాణ ప్రజా భద్రతా చట్టంలోని సెక్షన్‌‌‌‌ 3కి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని పిటిషనర్‌‌‌‌ న్యాయవాది సురేశ్ కుమార్‌‌‌‌ వాదించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో నిషేధం విధించడం చెల్లదన్నారు. అయితే సంఘాల పనితీరు ఆధారంగా చట్ట ప్రకారమే నిషేధ జీవో వెలువడిందని ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ చెప్పారు. వాదనలు విన్న కోర్టు.. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.